విజ్ఞాన భైరవ తంత్రం :
ప్రపంచం లోని అత్యుత్తమ ధ్యాన సాహిత్యం లో *రుద్ర యామళ తంత్రం* లో భాగమైన *విజ్ఞాన భైరవ తంత్రం* ఒకటి. దీనిమీద చాలా మంది ఇప్పటికే వ్యాఖ్యానించి ఉన్నారు. ఓషో రజనీష్ గారు దీనిపైన ఇచ్చిన ఉపన్యాసాలు *"The Book of Secrets"* అనే పేరుతో పబ్లిష్ అయి అమెరికాలో మూడు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించింది.
ఇటువంటి తంత్ర గ్రంధాలు ఎన్నో మూర్ఖులు,హింసా వాదుల దండ యాత్రలలో నాశనం అయ్యాయి. నలందా విశ్వ విద్యాలయం తగులబెట్టి నపుడు కొన్ని లక్షల విలువైన రీసెర్చి పుస్తకాలు నాశనం అయ్యాయి. నెలల పాటు ఆ లైబ్రరీ తగులబడుతూనే ఉందంటే... ఎన్ని లక్షల విలువైన పుస్తకాలు అందులో భస్మం అయ్యాయో ఊహించుకోవచ్చు. ఆ జ్ఞానంతరువాత తరాలకు అందకుండా మాయం అయ్యింది.
*Witch Hunt* పేరుతో మధ్య యుగాలలో ఎందఱో మార్మిక విజ్ఞాన ఖనులైన వనితలను , యోగులను,తాంత్రికులను , మంత్రగాండ్రు అనే పేరుతో పైశాచికంగా సజీవ దహనం చేసారు, కొంత మంది మూర్ఖ ధర్మాల వారు.
అలా దాడులలో నాశనం కాగా మిగిలిన అతి కొద్ది తంత్ర గ్రంధాలలో ఇదీ ఒకటి. ఈ ప్రక్రియల లోతునీ, అర్థ బాహుళ్యాన్నీ పరిశీలిస్తే మన దేశపు విజ్ఞానం ఎంతటి ఉన్నతమో అర్థం అవుతుంది. నాశనం అయి మనకు అందకుండా పోయినవిజ్ఞాన సంపదను తలుచుకుంటే భారతీయుని గా పుట్టిన ప్రతివానికీ కన్నీరు కారుతుంది. ఇటువంటి మతాలు మనకు ఏదో నేర్పాలని చూడటం వింతల్లో వింత. తాతకు దగ్గులు నేర్పటం లాంటిది.
విజ్ఞాన భైరవ తంత్రం లో శివుడు శక్తి కి ఉపదేశించిన 112 ధ్యాన విధానాలు ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని నేరుగా పొందాలి, అనుకునే వారికి ఉపయోగ పడే దీపికలు. ముఖ్యంగా ఏకాగ్రతను, ధారణను అభ్యాసం చేసేవారు వీటినిఆచరించ వచ్చు. వారి వారి అభ్యాస తీవ్రతను బట్టి ఫలితాలు పొందవచ్చు.
వీటిలోని ఔన్నత్యం ఏమిటంటే ఎక్కడాదేవతల గురించి పూజల గురించి నమ్మకం గురించి చెప్పని కేవల జ్ఞాన సంబంధ మైన సాహిత్యం ఇది. ఈ ప్రక్రియచెయ్యి ఈ ఫలితం పొందు అని మాత్రమే చెబుతుంది. అందుకే పేరు కూడా చాలా సరిగ్గా *విజ్ఞాన భైరవ తంత్రం* అనిపెట్టారు. ఈ 112 అభ్యాసాలనూ వరుసగా చూద్దాం.
ఈ విజ్ఞాన భైరవ తంత్రం వేదాంతపరము మరియు లోతైన ముక్తిపరమైన కాశ్మీర శైవానికి సంబంధించిన ప్రాచీన గ్రంథం. దీనికి ఎక్కడా తెలుగు బాషలో మూలం కానీ భావం కానీ లభ్యం కావట్లేదు. ఇందులో స్వయంగా ఈశ్వరుడు పార్వతికి *తంత్ర మార్గంలో* ధ్యాన పద్ధతులను ఉపదేశం చేస్తాడు. *భైరవ తత్త్వం ఏమిటి?* అని...శివుణ్ణి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈశ్వరుడు *భైరవ తత్త్వం* ఆలోచనా పరిధికి అందేది కాదని వివరిస్తూ భైరవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు *112* విధాలైన ధ్యాన మార్గాలను వివరిస్తాడు. ఆ ధ్యానాల సమాహారమే ఈ *విజ్ఞాన భైరవ తంత్రం*. ఇందులో ధ్యానపద్ధతులన్నీ సంభవోపాయం (ఉన్నత జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి), శక్త్యోపాయం (కొంచెం జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి) మరియు ఆణవోపాయం (సామాన్య పద్ధతి)గా విభజించబడ్డాయి. సాధారణంగా శక్త్యోపాయం బాహ్య ప్రపంచంపై ఆధారపడేదిగాను, సంభవోపాయం పూర్తిగా అంతర్గతం మరియు నిరాధారంగానూ ఉంటాయి. కాశ్మీర శైవానికి మూలపురుషుడైనటువంటి అభినవగుప్తుడి ప్రకారం ఒక ఆధ్యాత్మికాభిలాషి తగినంత అవగాహన చేకూర్చుకుని సంభవోపాయాన్నే ఎంచుకోవాలి.
విజ్ఞాన భైరవ తంత్రమన్నది *భైరవాగమము* నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞాన తంత్రము.
అనగా భౌతికములైన తంతులతో సంబంధము లేని, ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి.
నూట పన్నెండు పైగా ధారణా విధానములు దీనిలో ఉన్నవి.
దక్షిణ భారతము కంటే ఉత్తర, తూర్పు భారతమున ఈ తంత్ర ఉపాసకులు ఎక్కువగా మనకు కన్పిస్తూ ఉంటారు.
ముఖ్యముగా, కాశ్మీర శైవమునకు చెందిన త్రిక సాంప్రదాయులగు కౌలాచారులకు ఇది ప్రామాణిక గ్రంథము.
ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు.
మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. ధారణా విధానములు సూటిగా బోధించుట ఈ తంత్రము ప్రత్యేకత.
తంత్ర మార్గమందు నడిచే ఇచ్చ ఉన్నవారు, సమర్ధుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క
లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించుచున్నట్టి అనుభవములను పొందగలుగుతారు.
పూర్ణ భైరవ తత్వాన్ని ఆధ్యాత్మిక రూపాన్ని అవగాహన చేసుకోవాలంటే, *"విజ్ఞాన భైరవ తంత్రం"* చదవాలి. ఇందులో అనేక రహస్యాలూ శూన్యానికి, ప్రణవానికి, యోగానికి వున్న సంబంధాలూ వున్నాయి. ఇందులో భైరవుడు యోగిగా, పరబ్రహ్మ తత్వంతో కనిపిస్తాడు. పతంజలి యోగసూత్రాలవంటి యోగ రహస్యాలని విశదీకరిస్తాడు.
*యధాలోకేన దీపస్య* *కిరణౌర్భాస్కరస్య చ*
*జ్ఞాయతే దిగ్విభాగాది తద్వచ్చక్యా శివః ప్రియే*
సూర్యకిరణాలతో లోకం తేజోమయమై దర్శనీయమైనట్లు శివుడుకూడా (స్వ)శక్తి వల్ల దర్శనీయమౌతాడు. శక్తి పెరిగేకొద్ది శివానుభూతి అనుభవైకవేద్యమవుతుంది.
*ఓం నమః శివాయ*
Source : poojanilayam Blog
No comments:
Post a Comment