Translate

Tuesday, April 6, 2021

శివారాధన పద్ధతులు- -NOTEs


శివారాధన పద్ధతులు



 సత్సంగత్వే నిస్సంగత్వం.

శివారాధన పద్ధతులను తెలుపమని నేను ధర్మగుప్తులను కోరాను. వారిలా వివరించారు,  "అయ్యా! ఒక్కొక్క పూజా విధానంతో ఒక్కొక్క  దైవము సంతుష్టులు అవుతారు. సహస్ర నామ పఠన, అర్చనలతో విష్ణువు, మోదకాలతో గణపతి, నమస్కారంతో సూర్యుడు, అర్ఘ్యంతో చంద్రుడు, అభిషేకంతో శివుడు ప్రసన్నులు అవుతారు. నమకాలను చదువుతూ ఏకాదశ రుద్రాభిషేకం చేసినట్లయితే అప మృత్యుదోషాలు హరింపబడటమే కాకుండా ఏకాదశ తిథియొక్క పుణ్యబలం కూడా ప్రాప్తిస్తుంది. ఈవిధంగా ఏకాదశ రుద్రాభిషేకానికి ఏకాదశ తిథికి సన్నిహిత సంబంధము ఉండటంవల్ల శివ, కేశవులు అభిన్నులు అనేది నిర్వివాదాంశమే. కాగా శివారాధనలో శివ పంచాక్షరి అనుష్ఠానము మొదటి పద్ధతి, మహాన్యాస విధానము రెండవది, రుద్రాభిషేకము మూడవ పద్ధతి.


పంచతత్త్వారాధన


పంచాక్షరిలోని 5 అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు, కాబట్టి 


భూతత్వానికి          చందనం, 

 జలతత్వానికి        కొబ్బరినీళ్ళు అర్పించాలి; 

అగ్నితత్వానికై      దీపారాధన, 

వాయుతత్వానికై     సాంబ్రాణి ధూపం, 

ఆకాశతత్వానికై        ఘంటారావం చేయాలి.


సంధ్యోపాసన


పంచాక్షరిని పంచతత్త్వాలతో సాధన చేసే సాధకుల కను బొమల మధ్యలో పంచతత్త్వాలు సంధ్యా సమయాన వివిధ రంగులతో రూపు దిద్దుకున్న ఆకాశంలా రజత, అరుణ, స్వర్ణ, నీల, శుద్ధ ధవళం మొదలైన వివిధ వర్ణాలతో ప్రకాశిస్తూ దివ్య జ్యోతుల్లా కనిపించుతాయి. అందువల్లనే ఋషీశ్వరులు పంచాక్షరీ పంచ తత్త్వ సాధనను సంధ్యోపాసన అని వర్ణిస్తారు. 


యంత్రం, మంత్రం, పంచతత్త్వ సాధన, యోగసాధన, ఆత్మ సమర్పణ అనే పద్ధతుల ద్వారా దేహ, ఆత్మబుద్ధి నశించి, దేహమే దేవాలయంగా, జీవుడే శివాత్మగా మారి మోక్షము లభిస్తుంది. ఈ స్థితిని పొందడానికి శివపంచాక్షరి జపం, మహా  న్యాస పూర్వక ఆరాధన, రుద్రాభిషేకం చేయాల్సి ఉంటుంది. 


రుద్రులు వేలకొలది సహస్ర సంఖ్యలో ఉన్నారు, అంటే గణానికి ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రులకు (11 x 3 x 10000000 = 330000000) 33 కోట్ల రుద్రగణాలు ఉన్నాయని, వాళ్ళే పంచభూతాలను, దేహ, ప్రాణ, మనస్సు లను ఆవరించి ఉంటారని వేదం చెప్తున్నది. గణపతి 33 కోట్ల రుద్రగణాలకు అధిదేవత. శ్రీపాదులు గణపతి తత్త్వంతో అవతరించినందువల్ల వారిని సేవించి అర్చించేవారికి 33 కోట్ల రుద్రగణాల అనుగ్రహం లభిస్తుంది. 


రుద్రాక్షధారణ


శివభక్తులు ఖచ్చితంగా రుద్రాక్షను ధరించి తీరాలి. మానవు లలో వర్ణాలు ఉన్నట్లే రుద్రాక్షలలో కూడా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతి రుద్రాక్షలు ఉన్నాయి. తెల్లనివి బ్రహ్మ జాతివి. ఇవి దొరకడం చాలా అరుదు, వీటిని బ్రాహ్మణులు, ఎర్రని క్షత్రియ జాతి రుద్రాక్షలను క్షత్రియులు, చింతగింజ రంగు వైశ్య జాతి రుద్రాక్షలను వైశ్యులు, నల్లని శూద్రజాతి రుద్రాక్షలను శూద్రులు ధరించినట్లయితే వారి వారికి అను కూలంగా మంచి ఫలితాలు కలిగి పాపాలు నశించి సమస్త కోరికలు తీరుతాయి. లేతవి, బరువు లేని రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నిలిపి అడుగున చిన్నరాగి పాత్ర అంటే ఉద్ధరిణి, పంచపాత్ర మధ్య లో రుద్రాక్షను పెట్టినట్లయితే, అది కుడినుండి ఎడమకు ప్రదక్షిణ చేసినట్లయితే శ్రేష్ఠమైనవని, అపసవ్యంగా తిరిగితే మంచివి కావని తెలుసుకోవాలి. ఇటువంటి రుద్రాక్షలను ధరించిన గృహస్థులకు దారిద్ర్యం, భార్యావియోగం, అకారణ కుటుంబ కలహాలు కలుగుతాయి. సన్యాసులు వీటిని ధరించవచ్చు, బాధ లేదు.


రుద్రాక్షలు దేవతామూర్తులు


సాధారణంగా ఏకముఖినుండి ప్రారంభిస్తే 16ముఖాలవరకు ఉన్న రుద్రాక్షలు లభిస్తాయి. వివిధ రుద్రాక్షలకు వివిధ దేవతా స్వరూపాలతో సంబంధం ఉంటుంది. ఏకముఖి శివ స్వరూపం అయితే ద్విముఖి-అర్థనారీశ్వరుని, త్రిముఖి-అగ్ని, చతుర్ముఖి-బ్రహ్మ, పంచముఖి-కాలాగ్నిరుద్రుని, షణ్ముఖి-కార్తికేయుని, సప్తముఖి-మన్మధుని, అష్టముఖి-రుద్రభైరవుని, నవముఖి-కపిలముని, దశముఖి-విష్ణుని రూపాలు అయితే, ఏకాదశ ముఖి-సాక్షాత్తు రుద్రుని స్వరూ పము కాగా, ద్వాదశముఖి ద్వాదశాదిత్యుల స్వరూపం. ఇందులో నవముఖి రుద్రాక్ష దొరకడం చాలా కష్టం. దీనిలో విద్యా, జ్ఞాన, క్రియా మొదలైన నవ శక్తులు ఉండటంవల్ల ధరించిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి." ఇలా శివా రాధన, దానికి సంబంధించిన రుద్రాక్ష ధారణ వివరించిన తరువాత శ్రీపాదుల స్వరూపం గూర్చికూడా మాట్లాడుతూ శ్రీపాదులను శివస్వరూపులని భావిస్తే విష్ణువులా విష్ణువని తలచినట్లయితే శివునిలా కనిపించుతారని, భక్తులు వాళ్ళ మనసులోనుండి తర్క గుణాన్ని వదిలి వారిని శరణు వేడి నట్లయితే  యదార్థ రూపంతో కన్పించుతారు అని చెప్పారు.


తరువాత ఇద్దరం కురుంగడ్డకు వెళ్ళి, స్వామికి పాదనమ స్కారం చేసుకొని, కొంచెంసేపు ధ్యానస్థులం అయ్యాము. సాయంకాలం వారి ఆజ్ఞతో అవతలి ఒడ్డు చేరి జగత్ప్ర భువుల దివ్యలీలా ప్రసంగాలతో కాలం గడిపాము. సుదూరంగా ఎవరో యోగులు 'శ్రీపాద శ్రీవల్లభ దిగంబర' అంటూ సుశ్రావ్యంగా కీర్తిస్తున్న నామం చెవులకు అమృతంలా సోకుతుంటే ఆ మాధుర్యంలో మునకలు వేస్తూ మెల్లగా నిద్రలోకి జారాము.


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

No comments:

Post a Comment