Translate

Friday, September 10, 2021

*🌚మహాలయ పక్షం - పురాణ గాధ*

*🌚మహాలయ పక్షం -  పురాణ గాధ*

*ఎప్పటి  నుండి మహాలయ పక్షం ప్రారంభం,మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?*
🟧🟠🔶🟧🟠🔶🟧🟠🔶🟧🟠
🟧🔶🟠🟧🔶🟠🟧🔶🟠🟧🔶
👉🏿 మహాలయ పక్షం 20 సెప్టెంబర్నుంచి ప్రారంభమైఅక్టోబర్ 6  మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ ,  *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. 

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య  నైనా చేసి తీరాలి. 

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. 

ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా *‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’* అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. 

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. 

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
 *_మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?_*

🕉🕉🕉🕉🕉🕉
మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

20 సెప్టెంబర్నుంచి ప్రారంభమైఅక్టోబర్ 6 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

*పితృదేవతలకు.... ఆకలా...?*

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*

*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వా

రి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... 

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది.  పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి  సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.
 _*ఈరోజునుండి మహాలయ పక్షం ప్రారంభం (ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఏమి లభిస్తుంది)*_

🕉🕉🕉🕉🕉🕉
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం
ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు , తమ వంశాభివృద్ధి జరుగును . వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.

భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము , కృష్ణపక్షం పితృపదము , అదే మహాలయ పక్షము. మహాలయమంటే - *మహాన్ అలయః , మహాన్‌లయః మహల్ అలం యాతీతివా* అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము , పితృదేవతల యందు మనస్సు లీనమగుట , పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట , అని అర్థములు. అమావాస్య అంతరార్థం: *‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం.* చంద్రుడు , సూర్యుడిలో చేరి , సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. 

భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.

మహాలయ పక్ష ప్రారంభం /ఈరోజు నుండి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవ

తలు పూజలకు ఉద్దేశించినవి. 
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. 
జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. 

భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర , పౌత్రుల దగ్గరకు వస్తారు 
ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథి గా భావించబడినా , మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. 
ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు , విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది , కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. 
మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా తెలుసుకోన్నది.

1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

2. విధియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.

3. తదియ లో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.

4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగ వారు(శత్రువులు)లేకుండా చేయును.

5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.

6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.

7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.

8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.

9. నవమి మంచి భార్యను సమ కూర్చిను. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతు రాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.

10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.

11. ఏకాదశి రోజున సకల వేదా , విద్యా పారంగతులను చేయును.

12. ద్వాదశి రోజున స్వర్ణములను , స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.

13. త్రయోదశి రోజు న సత్సంతానాన్ని , మేధస్సును , పశు , పుష్టి , సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.

14. చతుర్దశి తిది రోజు న వస్త్రం లేక్ అగ్ని(ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.

15. అమావాస్య రోజున సకలాభిష్టములు  సిద్దించును

16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చును.

ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు , అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. 

ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. 

ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధం నాడు, లేదా ప్రతి రోజు ఉదయం, పుట్టినరోజు నాడు తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో, వారికి దుర్లభమైనది అంటూ ఏదీ ఉండదు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.

*🙏బ్రహ్మ ఉవాచ:*

౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!

ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!

సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 

౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!

సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!

ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 

౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము
ఫలశ్రుతి:
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!

1 comment: