Translate

Thursday, September 9, 2021

*శ్రీ గణపతి తత్వం అంతరార్థం*

*శ్రీ గణపతి తత్వం అంతరార్థం*

*‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్’ ప్రాచీన కాలం నుండీ నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాస్థ్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.*


*వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తిప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత. గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం. ఓంకార ప్రణవ నాద స్వరూపుడు మహా గణపతి. నామ మంత్రాలకు ముందు ‘ఓం’కారము ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభ కార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.*


*గణపతి పుట్టుక: జ్యోతిషశాస్త్ర అన్వయం ‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం భాద్రపదం. శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజోరూపం. చతుర్థి అనగా చవితి. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలనూ దాటిన తరువాతది నాల్గవది - తురీయావస్థ. నిర్వికల్ప సమాధి. ఆయన నక్షత్రం హస్త. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. విజ్ఞానప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేషరాశి నుంచి ఆరవ రాశి - కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం, శతృ ఋణ రణ రోగములను తెలియజేస్తుంది.* 


*మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. ఆ షష్ట్భావంతో (హస్తా నక్షత్రం,కన్యారాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితి నాడు పుట్టిన వినాయకుడు ఈ నాలుగు రకములయిన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.*


*కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. మీనరాశి కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. అంటే వ్యయ రాశి. మేష రాశికి వ్యయ రాశి పనె్నండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శత్రువులంటే అంతశ్శత్రువులు.* *అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవి. హస్తా నక్షత్రం, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి,లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడని జ్యోతిష శాస్త్ర అన్వయం.పత్రిపూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యం వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం గదా.* *హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవగ్రహములకు నవధాన్యములు, నవరత్నములు చెప్పబడ్డాయి. చంద్రుని తెల్లనివాడు - వినాయకుడు శుక్లాంబరధరుడు.*


*నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి, ఉండ్రాళ్లు నివేదన చేయటంలోగల ఆంతర్యమిదే. వినాయకునిది కన్యారాశి అని చెప్పుకున్నాం గదా. కన్యారాశికి అధిపతి బుధుడు కదా. బుధునికి నవరత్నములలో ‘పచ్చ’ రాయి- ఎమరాల్డ్ గ్రీన్ అనగా ఆకుపచ్చ రంగు. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. సంతుష్టు డవుతాడు స్వామి.*


*గరికపూజ ప్రీతిపాత్రం ఎందుకు?వినాయకునికి గరిక పూజ అంటే ప్రీతి అంటారు. వినాయక చవితినాడే గాక, ప్రతిరోజూ విఘ్నేశ్వరాలయాలలో, గరికతో స్వామిని అర్చిస్తారు.పూజాద్రవ్యములలో గరికను కూడా జత చేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకునే కథ ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు.న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నంది తీర్పు చెప్పాడు.అయితే ఆ తరువాత అమ్మతో నిజం చెప్పాడు. ‘ఈశ్వరుడు నాకు ప్రభువు. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా మీరిద్దరూ ఒకటే’ అన్నాడు.*


 *‘నందీ! నీవు నయం కాని వ్యాధితో బాధపడతావు’ అని శపించి, నంది దీనావస్థను చూచి జాలి చెంది, ‘నందీ! నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి. అతను అనుగ్రహంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది’ అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతికి అర్పించాడు. అతనికి శాపవిముక్తి లభించింది. ఇది వినాయక పూజలో గరిక ప్రాధాన్యత.*


*‘సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధి. లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము. మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది.*


 *దూర్వాయుగ్మం అంటే గరిక. అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు.మనోమాలిన్యాలను తొలగిస్తాడు.‘గజ’ శబ్దార్థము  వశ - శివ, హింస - సింహ, పశ్యకః - కశ్యపః అని వర్ణ వ్యత్యాసముతో మార్పు కలుగుతుంది.ఇదొక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ. ఆ విధంగా, జగ - గజ అని మారుతుంది. కనుక గజాననుడంటే ‘జగణాననుడు’ అని అర్థం. జగత్తే ముఖంగా గలవాడు. గ: లయము, జ- జన్మ. కనుక గజమనగా సృష్టి స్థితి లయములు గల జగత్తు అని అర్థము. ‘గ’ అంటే జ్ఞానము ‘జ’ అంటే పుట్టినది. గజమంటే జ్ఞానము వలన పుట్టిన మోక్షమని అర్థము.*


 *‘జ్ఞానదేవతు కైవల్యము’ కనుక గజముఖము, గజాననుని ముఖ దర్శనము శుభప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము. సృష్టికి ముందు ‘ఓం’ అని ధ్వని వినవచ్చింది. అది గజాకారముగా పరిణమించింది. కనుక గజమనగా ఓంకార ధ్వని. ఓంకారము గజ నాదము అనగా హస్తినాదము.‘అశ్వపూర్వాం రథమధ్వాం సస్తినాద ప్రబోధినమ్’ ఇంద్రియములనే గుర్రములచే పూన్చబడిన దేహము అనే రథము మధ్యలోనున్న చైతన్యమూర్తి. చిచ్ఛక్తి - పరదేవత నిరంతరము హస్తినాదముచే అనగా గజ నాదముచే -ఓంకార నాదముచే మేలుకొలువబడుచున్నది. ఇది ‘గజ’ శబ్దానికి శ్రీసూక్త మంత్రానికి సమన్వయం. అదే వినాయక చవితికి స్ఫూర్తి.‘ఆననము’ అనగా ప్రాణనము అనగా జీవకము అని అర్థము.* 


*గజమంటే జగత్తు కనుక, జగత్తుకే ప్రాణము గజాననుడు. గజాననుడనగా సృష్టి, స్థితి, లయ కారకుడని అర్థం. అందుకే మొదటిగా గజాననుని పూజ విధింపబడింది. సకల ప్రపంచమునకు ప్రాణదేవత - గజాననుడు.ప్రాణనాథుడే గణనాథుడు, నిఖిల ప్రాణి గణనాథుడు - గుణగణములు కలవాడు - గుణగణ నాథుడు.గణపతి - లలితా పరమేశ్వరి ‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర నామం. లలితాదేవి విఘ్నములను, అవిద్యను నశింపజేస్తుంది. కనుక ‘విఘ్ననాశినీ’ అని పేరు గల్గింది. మరి గణపతి కదా విఘ్నములను లేకుండా చేసేవాడు? దీనినిబట్టి, లలితాదేవి గణపతి స్వరూపిణి, గణపతి లలితా స్వరూపుడు అని తెలుస్తుంది. లలితా గణపతులకు అభేదం. విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు ఏకదం - అంతా ఒక్కటే. రెండవది లేదు అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు ఆ ఏకదంతుని ఉపాసించాలి ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు,తం- గణేశుని, అనేక దంతం- ప్రళయ కాలంలో అనేకములను హరించు గణపతిని ఉపాసించాలి అని అర్థములున్నాయి. ‘ఏకః నైకః నవః కః కిం’ విష్ణు సహస్ర నామముల భావమే ఏకదః అనేకదః’ అని చెప్పారు.*


*గజాననుని రూపం: ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములను అరిషడ్వర్గములను (కామక్రోధములు) నశింపజేసి,చితె్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవబ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించేవాడు వక్రతుండుడు.*


 *మూలాధార క్షేత్ర స్థితుడు. మూలాధారి. లంబోదరం - బ్రహ్మాండానికి సంకేతం. విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది. మొదకం ఆయన కృపాకటాక్షములలో ఆనందం లభిస్తుంది. నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం. మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమభావనా భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు.*


*‘యుక్తాహార విహారస్య’ అన్నారు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబంధించినవి. తమోగుణానికి నిదర్శనము. ‘బ్రతుకుట ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు.* *అటువంటి వారి గూర్చి ఇతరులు జాలి పడటం, మనసులోనైనా పరిహసించటం సహజం. యోగి అయిన వాడు యుక్తాహార విహారాదులతో, తమోగుణాన్ని జయించి తత్వ గుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగసిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని తన శరీరాకృతి, నాగయజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.*


*మూషిక వాహనం: అంతరార్థం మూషికం (ఎలుక) వాసనామయ జంతువు.తినుబండారాల వాసననుబట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు.అంతేకాదు అహంకారానికి చిహ్నం - ఎలుక (మూషికం) అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది.*


*బుద్ధిపతి అయిన మహాగణపతి దీనిని మలిచి జయించి సద్వినియగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.వినాయక చవితి పండుగనాడు ఉదయానే్న మంగళ స్నానములు (తలంటు) ఆచరించి, మట్టి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి, తమ పాఠ్యపుస్తకాలన్నిటినీ వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి, సద్బుద్ధి, విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తారు విద్యార్థులు. లక్ష్మీదేవి మూలాధార నిలయం. గణపతి కూడా మూలాధార నిలయుడు. తొలుతగా లక్ష్మీ పత్రార్చన సర్వకార్య సిద్ధిప్రదము. సకల ఐశ్వర్యప్రదం. కనుకనే తన సంగీత రూపకమునకు ఆదిలో శ్రీగణపతిని ‘శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా’ అని ప్రార్థనా రూపమైన మంగళమును పలికాడు నాద ముని శ్రీ త్యాగరాజస్వామి.*


*ముత్తుస్వామి దీక్షితులు: మహా గణపతి కీర్తనలు వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందినది, హంసధ్వని రాగ కీర్తన ‘వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం. వీతరాగిణం, వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం...’ తప్పక జ్ఞప్తి చేసికొని పాడుకోవాలి. కనీసం చదువుకోవాలి.*


 *గణపతి పూజలో ఇది ఒక భాగం అవ్వాలి. ఆ మహనీయుడు కీర్తనలు అందించాడు. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వాసుదేవాం నందిత’ నాటరాగ కీర్తన, గజాననము తం గణేశ్వరం భజాను సతతం సురేశ్వరం ఇత్యాదులు వినాయక చవితికి స్ఫూర్తినిచ్చే ఆణిముత్యాలు.*


*‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజము...’ శుక్లమైన అంబరం అంటే పరిశుద్ధ జ్ఞానం. అది అంబరం లాగా సర్వవ్యాపకం. దానినే ఒక వస్త్రంలాగా ధరించాడాయన. దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతాడు. శశి అంటే చంద్రుడు.*


*చంద్రుడంటే మనస్సు. మనోభూమికకు దిగి వచ్చి బోధిస్తాడు మనకు ఆచార్యుడు. బోధించే స్థోమత ఎలా వచ్చిందాయనకు. చతుర్భుజం. ధర్మ, జ్ఞాన, వైరాగ్వైశ్వర్యాలనే సిద్ధి చతుష్టయ ముందాయనకు. వాటిని నిత్యమూ అనుభవించే మహనీయుడు కనుకనే ప్రసన్న వదనం. తనకు ప్రసన్నమైన శివశక్తి సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో, దాన్ని మనకు ‘వదనం’ అంటే బోధించగలడు. ఆ బోధనందుకుంటే అదే మనకు సర్వవిఘ్నాప శాంతయే. సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది.*


*అహంకారమును దరికి రానీయక, భూతదయ గాలికి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు మహాగణపతి.*


*గణపతి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం.*

*గణం అంటే సమూహం. గణాలతో నిండి వున్న ఈ సమస్త విశ్వానికి అధిపతి గణపతి. అలాగే, అహంకారానికి ప్రతీక అయిన ‘ఎలుక‘ను శాసించి వాహనంగా చేసుకున్న గణపతిని, మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు.*


 *‘గణపతి అథర్వ శీర్శం’ ఆయన్ని పరబ్రహ్మగా చెపుతుంది. ‘నమస్తే గణపతయే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను. హే గణపతీ! ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యాలు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైందో ‘అది‘ నీవే అయి ఉన్నావు. అన్నింటికీ కర్తవు, ధరించే వానివి, లయం చేసుకునే వానివి నీవే. నీవే బ్రహ్మమూ, సత్యానివీ. నీకు నమస్కరిస్తున్నాను. సకల వాక్సంబంధిత శక్తివి, జ్ఞానమూర్తివి, ఆనంద మయునివి నీవే. పరబ్రహ్మం, శాశ్వతమైన వానివి నీవే. ప్రత్యక్ష పరబ్రహ్మవూ నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి’ అంటున్నది ‘గణపతి అథర్వ శీర్శోపనిషత్తు’.*


*మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవత అని అంటారు. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేలు కొల్పగలిగితే, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్‌ చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరంధ్రం చేర్చి బ్రహ్మ కపాల వి స్ఫోటనంతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది.*


*సుషుమ్న నాడి పక్కన ఇడ, పిం గళ అని రెండు నాడులు అనుసరించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానము, పింగళ అంటే కార్యసిద్ధి అలాగే ఇడ అంటే సిద్ధి, పింగళ అంటే బుద్ధి. మూలాధారం గణపతి, గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలనడంలోని అంతరార్థం ఇదే.* 


*అనగా గణపతి అంటే అష్టచక్ర గణములకు అధిపతి. గణపతి అంటే పదకొండు ఇంద్రియ గణములకు అధిపతి. పంచ తన్మాత్రలు, పంచ భూతాలు, పంచ విషయాలు, అహంకారం, మహాతత్త్వం, ప్రకృతి అనే 18గణములకు అధిపతి గణపతి.*


 *మన శరీరంలో ఉండే హస్తములు,పాదములు, జాను, జంఘ, ఊరు, కటి, ఉదర, హృదయ, కంఠ, ఆశ్య, ఫాల, శిర అను ద్వాదశ అయవయ గ ణములకు అధిపతి మన గణనాథుడు.*


 *అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపాలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. మంచి బుద్ధి అనగా శాశ్వతమైనదాన్ని పొందాలనుకోవడం. అనగా పరమాత్మను కోరుకోవడం. సంసారం, సిరిసంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ అశాశ్వతం.*


*కావున గణపతి శాశ్వతమైన వాటి గురించి జ్ఞానాన్ని, అశ్వాశ్వతమైన వాటి మీద వైరాగ్యాన్ని కలిగించి భక్తిని కలిగిస్తాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనగా సుషుమ్న, ఇడ, పింగళ అనగా మూలాధారం గణపతి, సిద్ధి, బుద్ధి. ఇదే గణపతి తత్త్వం.*

🕉🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment