Translate

Wednesday, September 8, 2021

మానవుని యందు ప్రజ్ఞలు-Master EK



*మానవుని యందు ప్రజ్ఞలు* 



  'నేను' అను మహాత్మ ప్రజ్ఞకు దిగువ ఏడు ప్రజ్ఞలున్నవి. అందు దిగువ భాగమున భౌతికము, ప్రాణమయము, మనస్సు, తెలివితేటలు మున్నగు ఆరు ప్రజ్ఞ లుండును. వీనికి పైనున్న ప్రజ్ఞ ఏడవది. ఈ ప్రజ్ఞలోనే దిగువ భాగమున బుద్ధి మొదలగు ప్రజ్ఞ లుండును. ఈ ఏడవ ప్రజ్ఞలోని పై భాగమున స్వచ్ఛమైన భాగమున్నది. అది 'బ్రహ్మ ప్రజ్ఞ' యనబడును. దాని యనుభవమే 'బ్రహ్మలోకము'. 

    దానికి క్రింది ఆరు ప్రజ్ఞలలోను జీవునిలో తెలిసి వర్తించుట, తెలియక మరల యజ్ఞానమునబడుట, జ్ఞప్తి కలుగుట, మరపు కలుగుట మొదలగు స్థితులు మారుచుండును. ఒకమారు ధ్యానమున బ్రహ్మలోకము 'ప్రజ్ఞ'ను అనుభవించినవాడు మాత్రము మరల దిగువ ప్రజ్ఞలలోనికి జారిపోడు. మరపు కలుగదు గనుక 'అజ్ఞానము'న పడడు. అట్టివానికే ఎనిమిదవదియగు 'అంతర్యామి ప్రజ్ఞ' యందు స్థాయి చిక్కును. ఎనిమిదవ సంతతిగా కారాగారమున కృష్ణుడు జన్మించెనని చెప్పబడిన కథలోని అంతరార్థ మిదియే! 

   ఈ చెప్పబడిన యేడు ప్రజ్ఞలును మానవునియం దుండును. 

ఒకటి, రెండు ప్రజ్ఞలగు భౌతికము, ప్రాణమయ స్పందనలు అను లోకములలో క్రిమికీటకాదులు, వృక్షాదులు పుట్టి చనిపోవుచుండును. 

మూడవది ఇంద్రియములు మనస్సు పని చేయునట్టి కక్ష్య. 

నాలుగవ కక్ష్యలో మనస్సుతోబాటు తెలివితేటలు పనిచేయును. వీరికి చెప్పిన పని చేయుట కాక, తోచిన పని చేయుట, ఇతరులు చేయవలసిన పనులను ఆజ్ఞాపించుట యను సామర్థ్యము లుండును. తనకు తోచినట్లు చేయుట యుండును. 

ఐదవ కక్ష్యలో ప్రవేశింపగలిగిన నరునకు ఇతరులకేమి కావలయునో తెలియగలుగుట యుండును. 

ఆరవ కక్ష్యలో అందరి యందును పనిచేయు సత్యము గోచరించును. దాని ప్రకారము తన కర్తవ్యము, ఇతరుల కర్తవ్యము తెలియుట, వర్తించుట యుండును. దిగువ కక్ష్యలు కూడా పనిచేసినపుడు ఆరవ కక్ష్య పని చేయదు. 

ఏడవ కక్ష్యలో ప్రవేశించిన వారికి దానియందు మిగిలిన యారు కక్ష్యలు నెట్లిమిడియున్నవో తెలియును. కనుక దిగువ కక్ష్యలోనికి దిగుట యుండదు. అన్ని కక్ష్యలలో ఆచరణ యుండును. 

- Master E.K.

No comments:

Post a Comment