🙏🪷🙏🪷🙏
తీర్థం యొక్క అర్ధం దాని పరమార్ధం ఏంటో తెలుసుకోండి:
🪷🪷🪷🪷🪷
ఉదకం చందనం చక్రమ్ శంఖంచ తులసీదళమ్॥
ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్॥
సాలగ్రామ శిలాచైవ నవభిస్తీర్థముచ్చతే
అంటే
ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం - ఈ తొమ్మిదింటి కలయిక వల్ల ఏర్పడే ఉదకాన్నే ‘తీర్థం’ అంటారు.
అలాగే
భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌నరః
ఆరోగ్యవాన్ సదా భూత్వాసాయుజ్యం లభతేమమ॥
సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం
సర్వరోగాది శమనం సర్వపాప హరంభవేత్॥
అంటే
భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని, తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని , పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు.
భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు ‘అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి.
పరమాణుసమం తీర్థం
మహాపాతకనాశనం
తదైవాష్టగుణం పాపం
తద్భూమౌ పతితాయాది॥
అన్నారు .. అంటే పరమాణు సమానమైన తీర్థం మహాపాతకాలని సైతం నాశనం చెయ్యగలది. అటువంటి తీర్ధం నేల మీద ఒక్క చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలని ఇస్తుందిట.
వస్త్ర చతుర్గణీకృత్య పాణౌ పాణిం నిధామయ
పవిత్రం విష్ణు పాదామ్ము త్రిః పిభేద్బిన్దు వర్జితమ్॥
ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని దానిపై కుడిచేతిని పైన చెప్పిన విధంగా శంఖువు ఆకారంలో పెట్టుకుని నేల మీద ఒక చుక్క కూడా క్రింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి. ముఖ్యంగా పూజారులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకి అందించడం లాంటిది చెయ్యకూడదు. అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం తీర్థం అని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి.
తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలుని ఉంచుతాం. అంటే బొటన వేలుని చూపుడు వేలుతో కొంచం నొక్కిపట్టి ఉంచుతాం. అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కన్పిస్తుంది. శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు అప్పుడు అది శంఖంలో తీర్ధం పోసినట్టే అవుతుంది కదా !
అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది. అదేంటంటే. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది , అలాగే చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ అవన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పెడతారు. తీర్ధం ఇవ్వడం పుచ్చుకోవడం వెనక ఇంత విషయం ఉంది.
సర్వేజనా సుఖినోభవంతు.
గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు.
🙏🪷🙏🪷🙏