My Spiritual Research Sounds-Vibrations-Reactions-Connectivity- నేను చదివిన,తెలుసుకొన్న కొన్ని విషయల గమనికలు.. కేవలం నా పునఃపరిశీలన కోసం వ్రాసుకున్నది- దయచేసి తప్పులు ఎమైన వున్నా,
అభ్యంతరాలు ఎమైన వున్న తెలుపగలరు
- సురేష్ కలిమహంతి
|| ఇతి శ్రీ శంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ |
తాత్పర్యము:-
*.. ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*… వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. . ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*.. ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.
*.. సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.