Translate

Wednesday, June 16, 2021

🌸సద్గురువు🌸

 🌸సద్గురువు🌸 


ఒక నది ఒడ్డున చెట్టు కింద ధ్యాన సమాధిలో ఉన్న సాధువు దగ్గరికి వెళ్లాడొక యువకుడు. ఆయన కళ్లు తెరిచాక 'స్వామీ! మీరు అనుమతిస్తే మీ శిష్యుణ్ని కావాలనుకుంటున్నాను' అన్నాడు. ఎందుకని అడిగాడు సాధువు. కొన్ని క్షణాలు ఆలోచించి 'మీలాగే దేవుడెక్కడున్నాడో కనుక్కోవాలనుకుంటున్నాను' అన్నాడు.

ఒక్క గెంతులో ఆ యువకుణ్ని సమీపించి అతని మెడ పట్టుకుని గబగబ నదిలోకి లాక్కుని వెళ్ళి నీళ్ళలో ముంచేశాడు సాధువు. ఒక్క నిమిషం పాటు అలాగే అతని తలను నీళ్ళలో ముంచి ఉంచాడు. ఆ యువకుడు గిలగిల కొట్టుకుంటుంటే అప్పుడతణ్ని వదిలిపెట్టాడు. నీళ్ళలోంచి తల ఎత్తి దగ్గి దగ్గి, మింగిన నీళ్ళను కక్కి, వూపిరి పీల్చుకుని కాసేపటికి స్థిమితపడ్డాడతను.


'ఇప్పుడు చెప్పు. నీళ్ళల్లో మునిగినంతసేపు ఏం చేయాలనుకున్నావు?' అని సాధువు అడిగాడు. వూపిరాడక గాలి కోసం కొట్టుకులాడాను' అన్నాడా యువకుడు.


'మంచిది. ఇంటికి వెళ్లు. నువ్వు వూపిరికోసం ఎంతగా గిలగిల్లాడావో అంతగా ఆ దేవుణ్ని దర్శించాలని పరితపించినప్పుడే నా దగ్గరకు రా! దైవసాక్షాత్కారానికి మార్గం చూపిస్తాను' అన్నాడు సాధువు.


'ఒక మనిషి అత్యుత్తమమైన ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలి గురుదేవా?' అని శిష్యుడడిగాడు. 'సర్వస్వం మరచి ధ్యాన సమాధిలోకి వెళ్లగలిగే స్థితి అది' అని జవాబిచ్చాడు గురువు. ఆయనెప్పుడూ ఆశ్రమానికి వచ్చేవారికి ఏర్పాట్లు చేయటం, భక్తులతో ప్రవచనాల్లో పాల్గొనటం, మొక్కలకు పాదులు తవ్వి నీళ్ళు పోయటం, గ్రంథ రచనలో మునిగిఉండటం... ఇలా ఎన్నో పనులు చేసేవాడే కానీ- తనతో చెప్పినట్లు ఆయనెప్పుడూ ధ్యాన సమాధిలో ఉండకపోవటం ఆ శిష్యుణ్ని ఆశ్చర్యపరచింది!

ఉండబట్టలేక 'అత్యుత్తమ స్థితికి చేరాలంటే అందరికీ ధ్యాన సమాధి అవసరమే కదా! మరి ఎప్పుడూ ఆశ్రమ కార్యక్రమాల్లో మునిగిపోయే మీకు ఆ ధ్యానానికి సమయమేది?' అని సరాసరి గురువుగారినే అడిగేశాడు. గురువు మందహాసం చేశాడు. 'నువ్వన్నది నిజం! అత్యుత్తమ స్థితికి చేరాలంటే ఆ ధ్యాన సమాధి అందరికీ అవసరమే! నేను అనుక్షణం చేస్తున్న పనే నా ధ్యాన సమాధి!'


ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మమైనది. గూఢమైనది. ఎవ్వరైనా తమ స్వశక్తితో దాన్ని పొందలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేనిదాన్ని అతి సులభంగా గురువు ప్రసాదిస్తాడు. వారా మార్గంలో నడచినవారు కనుక శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో ఉచిత క్రమంలో ఒక్కొక్క మెట్టే పైకెక్కించి ఉన్నత స్థితికి చేర్చగలుగుతారు. వారే సద్గురువులు!

No comments:

Post a Comment