Hora timings | ప్రతిరోజూ సూర్యోదయంతో ఆ రోజుకు అధిపతి అయిన గ్రహ హోరా ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు ఆదివారం రవి హోరాతో మొదలవుతుంది. సోమవారం చంద్ర హోరాతో మొదలవుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడి హోరాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. రవి, కుజ, శని హోరాలు కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాయి.
రవి హోరా: అధికారులను సంప్రదించడం, రాజకీయ, ఉద్యోగ వ్యవహారాలు, వైద్యం, క్రయవిక్రయాలు, కోర్టు లావాదేవీలు, సాహసంతో కూడుకున్న పనులు, విద్యాభ్యాసం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, రాజకీయ చర్చలకు అనుకూలం.
శుక్ర హోరా: శుభకార్యాలు, వాహన కొనుగోళ్లు, సంగీతం-నాట్య అభ్యాసం, తీర్థయాత్రలు, పరిమళ ద్రవ్యం, బంగారం, వెండి, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లు, పెండ్లిచూపులు తదితర పనులకు అనుకూలం.
బుధ హోరా: వ్యాకరణం, గణితం, శిల్ప, వాస్తు తదితర శాస్త్ర అభ్యాసం, జాతక పరిశీలన, న్యాయ వ్యవహారాలు, రాసే పనులు, వ్యాపార ప్రారంభం, పరిశోధనలు, సాంకేతిక విషయాలు, మధ్యవర్తిత్వాలకు బుధ హోరా అనుకూలమైనది.
చంద్ర హోరా: భోజనం, సముద్ర ప్రయాణాలు, నూతన దుస్తులు, నగలు ధరించడం, ఆలయ సందర్శన, దేవతార్చన, స్థల మార్పు, రాజీ ప్రయత్నాలు, ధాన్యం, పంట ఉత్పత్తులు, దుస్తులు కొనడం, మాతృ సంబంధ వ్యవహారాలకు చంద్ర హోరా అనుకూలం.
శని హోరా: శుభకార్యాలకు శని హోరా అనుకూలం కాదు. మినుములు, ఇనుము, నువ్వులు, తైలం, యంత్రపరికరాల కొనుగోలు, శ్రమతో కూడుకున్న పనులకు, పరామర్శలకు, వాహనాల మరమ్మతులకు శని హోరా అనుకూలం.
గురు హోరా: ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. శుభకార్యాల నిర్వహణ, పెండ్లి చూపులు, వివాహ నిర్ణయం, పుస్తక పఠనం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భాషాధ్యయనం, బ్యాంకు లావాదేవీలు, నూతన వస్ర్తాభరణాల కొనుగోలు, తీర్థయాత్రలు, ధార్మిక విషయాలకు గురు హోరా అనుకూలం.
కుజ హోరా: కొన్ని విషయాలకు మాత్రమే కుజ హోరా అనుకూలంగా ఉంటుంది. భూ వ్యవహారాలు, రియల్‌ఎస్టేట్, ఎలక్ట్రికల్, పోలీసులను సంప్రదించడం, భూ సేకరణ, గృహ నిర్మాణ భూకొలతలు, శస్త్ర చికిత్స విషయంలో వైద్యులను సంప్రదించడం తదితర పనులకు కుజ హోరా అనుకూలం.