Translate

Monday, November 29, 2021

Aura Sheath- ఆరా - దాని 7 పొరలు - విశ్లేషణ- (Aura Sheath and it's 7 layers)

 

ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ

(Aura Sheath and it's 7 layers)



 మానవ శరీరం చుట్టూ ఉండే జీవ-విద్యుదయస్కాంత క్షేత్రమే "ఆరా"(aura). ఈ ఆరా లేదా కాంతి వలయం తల వద్ద హెచ్చుగా ఉండి, పాదాల వద్దకు వచ్చేసరికి పలుచగా ఉంటుంది. ఈ ఆరా , మనతో నిత్యమూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం నిరంతరం సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం 7 పొరలుగా ఉంటుందని....ఈ పొరలు ఒక దానికొకటి ఓత-ప్రోతాలులా అల్లుకొని ఉంటాయని , అధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ప్రతీ ఆరా పొర, మన సూక్ష్మ శరీరంలోగల ఏడు చక్రాలకు సంబంధం కలిగియుంటుంది.


మొదటి పొరను "ఎథిరిక్" లేదా లింగ శరీరం అంటారు. ఈ ఎథిరిక్ , మూలాధార చక్రంతో సంబంధం కలిగియుంటుంది. ఈ ఎథిరిక్, మన భౌతిక శరీరానికి అతి సమీపములో ఉన్న పొర. ఈ పొర స్థలంలో ఒక రకమైన భౌతిక ఆకృతిని కలిగి యుంటుంది. ఈ పొర దాదాపు 5 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఎథిరిక్ పొరలో "నాడులనే" ప్రాణ శక్తి వాహకాలుంటాయి. ఈ ఎథిరిక్ శరీరము, బహిరంగ(భౌతిక వాతావరణ,జీవన విధాన పరిస్థితులు) మరియూ అంతర్గత (భావాలు,ఆలోచనలు) పరిస్థితులను కలిగి ఉంటుంది.


ఈ ఆరిక్ షీత్ లో రెండవ పొర "emotional body" (భావాత్మక శరీరము). ఇది స్వాధిష్ఠాన చక్రముతో సంబంధం కలిగియుంటుంది. మనలో నిత్యం కలిగే భావాత్మక సంచలనాలకు ....ఈ ఆరిక్ షీత్ యొక్క రెండవ పొర ప్రతిబింబంగా ఉంటుంది. ఇది , మన శరీరం నుండి 7 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది.


 ఈ పొర , ఎథిరిక్ మరియూ భౌతిక శరీరాలలోకి చొచ్చుకొనిపోయి ఉంటుంది. ఈ పొర మన మనస్సుకు, భౌతిక శరీరానికి మధ్య వారధిగా పని చేస్తుంది కూడా. మనలను అఖండ చైతన్యం వైపు నడిపించే, చోదకునిలా కూడా ఉంటుంది.


మూడవది. మానసిక శరీరం. అంటే మనస్సే. మనస్సు మరల అనేక సూక్ష్మావస్థలలో కలదు. అది తరువాత. ఈ మనోమయ శరీరం గూచ్చి చెప్పుకుందాం. ఈ మానసిక శరీరం, మన సూక్ష్మ శరీరంలో గల "మణిపూరక చక్రంతో" సంబంధం కలిగి ఉంటుంది. ఈ mental body,  7 నుండి 20 సెంటీ మీటర్ల వరకు....విస్తరించి ఉంటుంది. అయితే ఈ శరీరం, మన మానసిక ఆలోచనా క్షేత్ర తీవ్రతలను బట్టి, సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ మానసిక శరీరంలో, ఆలోచనా రూపాలు....మనకు కనిపిస్తాయి. మరియూ ఆ రూపాలు , భిన్న రంగులతో ఒక స్పందనను కలుగ జేస్తాయి.


ఇక 4వ శరీరము. యాష్ట్రల్ శరీరము (ashtral body).

 ఈ "ఆష్ట్రల్ శరీరము , 4వ చక్రమైన "అనాహత చక్రంతో" సంబంధం కలిగి యుంటుంది. భౌతిక - అభౌతిక శరీరాల మధ్య వారధిలా పని చేస్తుంది. భావాత్మక శరీరం లాగానే, ఈ శరీరం కూడా భిన్న వర్ణాలతో కూడి యుంటుంది. ఈ నాల్గవ శరీరము...15 సెంటీ మీటర్ల నుండి 30 సెంటీ మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీర ఆరోగ్య స్థితిని బట్టి, ఆధ్యాత్మ ఆరోగ్య స్థితి బట్టి కూడా ఆధార పడియుంటుంది.


ఇక 5వ పొర. "Etheric template body". ఇది 5 వ చక్రమైన "విశుద్ధ చక్రానికి" అనుసంధానించి ఉంటుంది.


6 వ పొర " Celestial body" . ఇది నేరుగా "ఆజ్ఞాచక్రంతో " సంబంధం కలిగియుంటుంది. మూడవ నేత్రం ద్వారా లోపల బయట గల "భగవత్ కాంతి" ని ఈ శరీరం చూసే ప్రయత్నం చేస్తుంది. పరిధులు లేని,అవధులు లేని ప్రేమను...ఈ పొర ప్రతిబింబిస్తుంది. అది ఈ భౌతిక శరీరంపై పడుతుంది.


ఇక 7వది అయిన "Casual Body" .  ఈ 7వ పొర , ఈ జన్మలో...ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణంతో సంబంధం కలిగియుంటుంది. ఆరాలో గల ఈ ఏడవ పొరలో, గత జన్మల వివరాలుంటాయి. ఈ పొర మన అధ్యాత్మిక అభివృద్ధిని కూడా సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఏడు పొరల ఆరా ఎలా వ్యక్తీకరించబడి ఉన్నదో....వాటన్నిటినీ ఈ ఒక్క పొర ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి "ఆరా" చూసి మనం అతడు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నాడా లేక పశువులా ప్రవర్తిస్తున్నాడా? అన్న విషయం చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా లేక జబ్బులతో బాధ పడుతున్నాడా....అన్న విషయం కూడా చెప్పవచ్చు. కాకపోతే , ఆరా చూసే వ్యక్తి "సిద్ధుడు" అయితేనే ఇది సాధ్యం. ఆ సిద్ధత్వం మరీ అంత కష్టం ఏమీ కాదు. కాకపోతే...సతత అభ్యాసం...కనీసం 12 సంవత్సరాలు (పుష్కర కాలం) కావాలి. 


మన ప్రతి సంకల్పము, మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా, రూపు దిద్దుకొని ఉంటుంది. ఒక మనిషి చావు-బ్రతుకుల్లో ఉంటే, అతని ఆరా దాదాపు లుప్తంగా ఉంటుంది, మినుకు మినుకుగా.......


సందర్భాన్ని బట్టి ఇంకో విషయం కూడా చెప్పుకుందాం. శరీరానికి వెంటనే ప్రాణం పోదు. అతని ఆరా, ఆ మృత శరీరం దగ్గరే మెల్లగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ ఆరాని చూడగలిగే యోగి, అతని మరణ కారణాన్ని తెలుసుకోగలడు.


     కొన్ని సార్లు ఈ "ఆరా" ఏడడుగుల ఎత్తు, నాలుగడుగుల వెడల్పు కలిగి (ఉన్నత వ్యక్తులకైతే), శిరస్సు వద్ద లావు గానూ, కాళ్ళ వద్దకు వచ్చేసరికి సన్నంగానూ ఉంటుంది.


    మానవ శరీరం యొక్క "ఆరా క్షేత్రం", మనిషి యొక్క భౌతిక శరీరము చుట్టూ, అండాకారంగా, ఒక గుడ్డు ఆకారంలో....శక్తి రూపంలో చుట్టుకొని ఉంటుంది. దివ్య దృష్టితో ఈ ఆరాను చూస్తే, వివిధ ప్రదేశాలలో...వివిధ గుణాలతో భాసిల్లుతూ ఉంటుంది. ఈ ఆరా ఎంతవరకైతే...వ్యాపించి ఉంటుందో, ఆ వ్యాపనం యొక్క హద్దుల వరకు చూడవచ్చు.


సాధన ద్వారా, కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని....మనం పెంచుకోగలిగితే,  మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న "ఆరా" స్పష్టంగా కనిపిస్తుంది.

- Bhattacharya's notes 

   మనం ఈ ఆరాను చూస్తే, ఆరా రంగులు, ఆరా యొక్క కాంతి క్షేత్రం, ఆరా యొక్క చీకటి క్షేత్రం, ఆరా ఆకారం, ఆరా సాంద్రత....ఇవన్నీ అవగాహనకు వస్తాయి. ఈ ఆరాను మనం వినవచ్చు కూడా. శబ్ద, సంగీత, తరచుదనం, స్పందన....వినవచ్చు. కాకపోతే నిధి ధ్యాసనము, సతత ధ్యానము, సతత మంత్రానుష్ఠానము ఉండాలి. ఇవి లేకుండా ఆరాను చూడాలంటే....కుదరదు. కొంతమందికి చాలా చిన్న వయస్సు నుండే, ప్రత్యేక సాధనలేవీ లేకుండా ఆరాను చూస్తూంటారు. వారు కారణ జన్ములు. వారి జన్మలు ధన్యం. ఆరా శక్తిని కూడా, మనం బయో-టెలిమెట్రీ ద్వారా గ్రహించవచ్చు.


   ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగానూ, ఆత్మ విశ్వాస పూరితులు గానూ, శాంత చిత్తులు గానూ ఉంటారో....మీ ఆరా (శరీర కాంతి వలయం), పరిశుభ్రంగానూ,ఆరోగ్యంగానూ ఉంటుంది. ఒక ఆరోగ్య వంతమైన ఆరా "Cocoon of Energy" గా విస్తరించుకొని ఉంటుంది.


     ఈ  ధనాత్మక - రక్షణాత్మక శక్తి క్షేత్రం....అనేక రంగులతో, శక్తి వంతమైన స్పందనలతో.....పూర్తిగా అండాకారపు హద్దుతో ఉంటుంది. ఏ వ్యక్తి తీవ్ర తపములో ఉంటాడో, ఏ వ్యక్తి ధ్యానము నుండి సమాధి స్థాయికి వెళతాడో, ఏ వ్యక్తి మంత్రోచ్ఛారణ నుండి మహా భావ సమాధికి వెళతాడో, ఏ వ్యక్తి యొక్క కుండలినీ శక్తి పరిపూర్ణంగా వికాసమై ఉంటుందో, అట్టి యోగి "ఆరా" (aura)...అనగా శరీరాన్నావరించిన కాంతి వలయం పూర్తిగా వికసితమై ఉంటుంది. అలాంటి పూర్ణ యోగుల ఆరా "బంగారు వర్ణం" లో ఉంటుంది.



No comments:

Post a Comment