ప్రతి మనిషికి
1. స్థూలశరీరం లయం
2. సూక్ష్మ శరీరం లయం
3. కారణ శరీర లయం
4. మహా కారణ శరీరం
స్థూల శరీరము కర్మజమగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల దేహము క్షీణించును. స్థూల శరీరము ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? అది జడం కదా. పంచభూతాలు ఎందుకు పంచీకరణ అయి స్థూల శరీరంగా మారింది? అన్నము వలన శుక్లశోణితాల వలన పిండం ఎందుకు వచ్చింది? పిండం వచ్చి, బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖదుఖాలు పొందుతున్నాడు కదా! ఈ స్థూల దేహం దానికే ఉపయోగిస్తోందా. దీనిని ఎవరు తెచ్చుకున్నారు? కర్మ చేయడానికి ఈ పనిముట్టు కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఈ పనిముట్టు. ఈ పనిముట్టు అవసరం ఎవరికి వుంది? ఏ సూక్ష్మ శరీరం అయితే మంచి చెడు కర్మలు చేసిందో ఆ చేసిన పనే మళ్ళీ చేయడానికి ఈ పనిముట్టు కావలసి వచ్చింది. ఇంకొక జన్మ, ఆ జన్మలో కూడా తృప్తిపడకుండా వున్నది. శరీరాన్ని విడిచి వుండలేకుండా వున్నది. ఏదో చేయాలని చేయలేకుండా వున్నది. ఇప్పుడు చేద్దాం అనేటటువంటి సంస్కారము, వాసన ఏదైతే ఆ సూక్ష్మ శరీరంమీద ముద్రించబడిందో ఆ సూక్ష్మ శరీరమే తను ఇవన్నీ చేయడానికి ఫలితాలు పొందటానికి, మరల ఈ పనిముట్టును తెచ్చుకుంది. అంటే స్థూల శరీరం రావడానికి కారణం సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అలా వుండటానికి కారణం కారణ శరీరం, వాసనలు. వాసనా క్షయం అయితే లింగదేహం భంగమవుతుంది. కారణ శరీరం వున్నంత వరకు వాసనలు వున్నంత వరకు లింగ శరీరం సూక్ష్మ శరీరంగా వున్నంత వరకు సూక్ష్మ శరీరం స్థూల శరీరమును పనిముట్టుగా తెచ్చుకుంటుంది. స్థూల శరీరము కర్మజ మగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల శరీరము కూడా క్షీణించును. వాసనా క్షయం అయితే స్థూల శరీరం వుండదు.
సూక్ష్మ దేహము సహజమగుట వలన కత్తుల చేత నరకబడక జలముచేత నానక అగ్నిచేత దహింపబడక వాయువు చేత శోషింపబడక, ఉంటూనే ఉంటుంది. ఏమిటీ అత్మకున్న లక్షణాలు సూక్ష్మ శరీరానికి కూడా వున్నాయి? సూక్ష్మ శరీరం కూడా కత్తుల చేత నరకబడదు. నీళ్ళలో నానదు. అగ్నిచేత కాలదు. వాయువుచేత శోషింపబడదు. వృత్తి ప్రళయము, నిత్య ప్రళయము, దేహ ప్రళయము, మను ప్రళయము, బ్రహ ప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్ పురుష ప్రళయము ఇవన్నీ దశ విధ ప్రళయాలు. దశవిధ ప్రళయాలయందు కూడా ఈ సూక్ష్మ శరీరము చెడక వుంటుంది. ఇది విదేహ ముక్తి పర్యంతము వుంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం వుంటుంది. విదేహ ముక్తుడికి స్థూల శరీరం పడిపోతుంది. లింగ శరీరము భంగమవుతుంది. అంతవరకూ ఈ సూక్ష్మ శరీరం ఉంటూనే వుంటుంది.
ముక్తి కోరువారు ముందుగా సూక్ష్మ శరీరమును చెరపగోరక కారణ శరీరమును చెరపవలెను. మోక్షం కావాలంటే సూక్ష్మ శరీరమును చెడగొట్టడంవల్ల అది పోదు. ఒక రాక్షసుడు చంపితే వాడినుంచి చిందిన ప్రతి బొట్టు ఒక రాక్షసుడు అయింది. అలాగే సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే కొన్ని వేల ముక్కలు అవుతుంది. వేల ముక్కలు వేల స్థూల శరీరాలను తెచ్చుకుంటుంది. అందుకే ఒక తండ్రికి పదిమంది కుమారులు కూడా, తండ్రే కుమారుడయ్యాడు. దాని అంతరార్ధం అది. ఆ రాక్షసుడు ప్రతి చుక్క కూడా రాక్షసుడయ్యాడు. ఒక కారణ శరీరం పది విభాగాలు అయినప్పుడు, తండ్రి యొక్క కర్మ కొడుక్కి పంచబడ్డప్పుడు తండ్రీ కొడుకూ ఒక్కడే. తండ్రి తన శరీరము ద్వారా అనుభవించాల్సినది తృప్తి చెందక తన శుక్లముతో పాటుగ తన సంచిత కర్మలో కొంత భాగాన్ని కూడా కుమారులకు పంచుతాడు. వారు తయారవుతారు. తండ్రి తన భార్య గర్భములో శుక్ల రూపంలో ప్రవేశించి, ఆ తండ్రే ఆ భార్యకు కొడుకు అయ్యాడు. కాబట్టి తండ్రి తనయొక్క భార్యనుండి తానే కొడుకై వచ్చాడు. శుక్లరూపంలోనే కాకుండా సంస్కార రూపంలో వచ్చాడు. నలుగురు కొడుకుల రూపంలో వచ్చినా కూడా నలుగురు బిడ్డలూ కూడా ఆ తండ్రే. ఆ రకంగా సూక్ష్మ శరీరం కూడా ఎన్నైనా విభాగాలు కావచ్చు, కారణ శరీరం కూడా కొన్ని వాసనల కుప్పని ఎన్నైనా విభాగాలు చేయవచ్చు. అయితే ఎప్పుడూ అలా వుండదు. దీనికి కూడా ఒక అవకాశముగా గుర్తు పెట్టుకోండి.
జనాభా పెరగడానికి కారణము ఒక్కొక్క కారణ శరీరము అనేక కారణ శరీరాలుగా విభాగమవ్వడమే. ఎందుకంటే మనం ముందు ఎవరమూ లేము. మహాకారణం నుండి కొన్ని కారణాలు విడిపోయాక, ప్రతి ఒక్క కారణ శరీరానికి సూక్ష్మ, స్థూల శరీరాలు వచ్చి చేరితే మనము ఉన్నాము. జన్మముందా? కర్మముందా? అంటే ఈ విధముగా కర్మేముందు అవుతుంది.
పునర్జన్మలలో తిరిగేవారికైతే మరణానంతరము సూక్ష్మ శరీరము తన అధిష్ఠాన దేవతయైన పితృ దేవతలలోనికి లయమవుతుది. ఇంద్రియాలన్నీ వాటి అధిష్ఠాన దేవతలలో లయమవుతాయి. కారణ శరీరం అవ్యక్తంగా ఉంటుంది. పునర్జన్మలో, స్థూల శరీరం పంచభూతాల పదార్థముగా తయారవుతుంది. గోళకాలు ఏర్పడగానే ఇంద్రియాలు, వాటివాటి అధిష్ఠాన దేవతలనుండి వచ్చి ఆ గోళకాలలో చేరి ఉంటాయి. పితృ లోకమునుండి ప్రేతాత్మ అనబడేటటువంటి సూక్ష్మ శరీరం స్థూలంలోకి వచ్చి చేరుతుంది. కారణము సమయానుకూలముగా కార్యరూపములోకి వచ్చి అనుభవాలను కలుగచేస్తుంది.
ముక్తి కోరువారు సూక్ష్మ శరీరమును భంగపరచాలని చూడక, ముందుగా కారణము శరీరమును సున్నా చేసే ప్రయత్నము చేయవలెను. ఈ రెండు శరీరాలు కూడా మొదట ఎక్కడనుండి ఉనికిలోకి వచ్చాయో, మళ్ళీ అక్కడికే వెళ్ళి లయం కావాలి. అప్పుడే ముక్తి.
ముక్తి కోరేవారిలో సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమందు వాటియొక్క అధిష్ఠానములందు లయమవుతాయి. ఈ సూక్ష్మ కారణ శరీరాల అధిష్ఠానం ఎవరండి? ఎవరు వారు? పంచ అధిదేవతలు. సదాశివ ఈశ్వర బ్రహ్మ విష్ణు రుద్ర ప్రత్యగాత్మ ప్రకాశరూపముగా వున్న పంచబ్రహ్మలే పంచకర్తలు. ఈ సూక్ష్మ కారణ శరీరాలకే కాకుండా స్థూల శరీరము పంచీకరణము ద్వారా ఏర్పడటానికి కూడా శుక్లశోణితాలలో వున్నటువంటి జీన్స్ కూడా ఈ పంచ అధిదేవతలే. అధిదేవతలే అక్కడ జీన్స్ రూపంలో స్థూల శరీరోత్పత్తికి అక్కడికక్కడే కారణ భూతంగా వున్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో లోకంలో వుండి సృష్టి చెయ్యడం లేదు. ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడే ఆ ప్రజాపతి బ్రహ్మ వున్నాడు. సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమున వాటి అధిష్ఠాన దేవతలయందు లయింపచేయవలెను. పంచబ్రహ్మలయందు లయింపచేయాలి. అంటే అష్టప్రకృతులు లయంలో ఎక్కడిదాకా చెప్పాం. అవ్యక్తం దాకా చెప్పాం. అవ్యక్తంలో ఎవరున్నారు? ఆ పంచబ్రహ్మలు వున్నారు. కనుక అష్ట ప్రకృతి లయము ద్వారా ఇంద్రియ లయము చేసుకొని అవ్యక్తములో వున్న పంచబ్రహ్మలలోకి సఛ్ఛిష్యునియొక్క సూక్ష్మ కారణ శరీరములు అక్కడ లయపరచుకోవాలి. అదే విదేహ ముక్తి. లేనిచో అన్యోన్యాశ్రయముగా సూక్ష్మము వుంటేనేమో కారణ ముంటుంది. కారణము వుండటంవల్ల సూక్ష్మము వుంటుంది. ఇద్దరూ కలిసే వుంటారు.
ఈ కారణ శరీరము భ్రాంతిజమగుట వలన అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము చేత భ్రాంతి నశింపజేసెనేని భ్రాంతి వలన కలిగిన కారణ శరీరము నశించును. మొదట్లో మనకు ఎక్కడ భ్రాంతి ప్రారంభిస్తుందో అక్కడే సూక్ష్మ శరీర నిర్మాణం జరిగిపోయింది. ఒకే జన్మ ఒకే మరణం. వాడు ఎన్ని లక్షల జన్మలైనా ఎత్తనీ - పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, మానవ పునర్జన్మలు ఎన్నైనా పొందనీ సూక్ష్మ శరీరము కంటిన్యూ అవుతోంది. స్థూల శరీరాలే మారుతున్నాయి. స్థూల ఉపాధులు మారుతున్నాయి. సూక్ష్మ శరీరము సూక్ష్మ ఉపాధి అలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే విదేహ ముక్తుడయ్యాడో, ఎప్పుడైతే వాసనా క్షయం అయిందో, ఎప్పుడైతే కారణ శరీరం సున్నా అయిందో, అప్పుడే లింగ శరీరం భంగమయింది. ఇది ఆ సూక్ష్మ శరీరం యొక్క మరణం. ఒకే జన్మ ఒకే మరణం అంటే ఎప్పుడు భ్రాంతి మొదలయిందో అది జన్మ. ఎప్పుడు భ్రాంతి రహితమయిందో అది మరణం.
భ్రాంతి విడిచినప్పుడు, సర్వము మిథ్య అని తోచును. భ్రాంతిలోనే అన్నీ వున్నాయి అని తోచును. భ్రాంతి పోతే ఏదీ లేదు, నువ్వూ లేవు. నిజంగా నీవు కూడా లేవు. భ్రాంతి పోగానే అన్నీ పోయినాయి. లేనివే లేకుండా పోయినాయి. ముందుగా వున్నవాటికి లేవనే భావంతో మిథ్యగా చూశావు. తరువాత భ్రాంతి రహితం కాగానే మిథ్యగా చూడటం కూడా పోయి, అసలు అవి తోచుటయే లేవు. ఈ ఉపాధి కాని, నీవు కాని, నీ చుట్టూ వున్న దృశ్యమాన ప్రపంచం గాని ఏమీ తోచుట లేదు. ప్రపంచము, జీవోపాధులు మొదలే లేవు. వాటి వాసన లేదు, వాటి వృత్తీ లేదు, వాటి ఎరుకే లేదు. ఒకప్పుడు చూసి ఇప్పుడు చూడకపోతే వాటి జ్ఞాపకం వుంటుంది. అవి ఉన్నాయనే ఎరుక లేకుంటే, ఎలా జ్ఞాపకం ఉంటుంది? అందువలన వాసనలను, జ్ఞాపకాలను, గుర్తులను, వాటన్నింటికీ మూలమై ఎరుకను, ఎరిగే ఎరుకను లేకుండా చేసుకుంటే భ్రాంతి వదిలింది. అట్టితరి కర్మ వాసనలుండవు. మరియు జ్ఞానాజ్ఞానములుండవు. లింగ శరీరము భంగమై, ప్రకృతియందు లయమవుతుంది. అంటే విలయమవుతుంది. మాయ వలన వచ్చింది, కనుక, తిరిగి మాయలోనే విలీనమవుతుంది. కారణ మహాకారణాలు అవ్యక్తము లేక మూల ప్రకృతిలో లయం..
సహజత్వమే దివ్యత్వం!!
సృష్టిలో దాక్కుని ఏ ఒక్క రహస్యం లేదుగాక లేదు, వున్నదంతా సహజత్వమే,
కానీ ఒక్క మనిషి మాత్రమే తెలివి పేరు చెప్పుకుంటూ అహంకారంతో అసహజత్వం ముసుగుగా వేసుకున్నాడు కాబట్టి నిజంగా సహజంగా వున్న తత్త్వం రహస్యంగా కనిపిస్తుంది, రహస్యం సహజంగా కనిపించాలి అంటే మొదట మనషి తన సహజస్థిని తెలుసుకొని అందులో జీవించగలగాలి,
మనషి సహజస్థితి మానవత్వంతో మనిషిగా ఉండటం,
అలా మనిషిగా ఉంటే
తన సహజస్థితిలో ఉంటే అప్పుడు అతడు రహస్యం అనుకుంటున్న సహజత్వమైన దైవత్వస్థితిలోకి తనకు తెలీకుండానే వెళతాడు!!...
No comments:
Post a Comment