1. విభూతి అంటే ఏమిటి?
విభూతి అంటే విశేషమైనది అని అర్థం. హోమ ద్రవ్యాలైన దర్భలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయ , మోదుగ, రావి, తులసి మొదలైన కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకలు, నవధాన్యాలు నెయ్యి మొదలైనవి వేసి హోమం చేయగా చివరకు మిగిలిన బూడిదను విభూతి అంటారు. అగ్నికి దహించే గుణం ఉంటుంది. హోమద్రవ్యాలైన కొబ్బరికాయ, కట్టెలు, పిడకలు, నవధాన్యాలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంటుంది. ఈ రెండింటి కలయికవల్ల ఏర్పడిన విభూతి, దహించడం, దహింపబడటం అనే రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. పరమ శివ భక్తులు విభూతిని తప్పక ధరిస్తారు.2. విభూతి ని ఎలా ధరించాలి?
శ్రీకారం చ పవిత్రం చ శోక రోగ నివారణం
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రైలోక్య పావనం
ఈ శ్లోకాన్ని పఠిస్తూ విభూతిని ధరించాలి.
కుడిచేతి మధ్యవేలు మరియు ఉంగరపు వేళ్ళ సాయంతో విభూతిని ధరించాలి. నుదుటిపై విభూతిని ధరించేటప్పుడు ఎడమవైపు నుండి కుడివైపుకు రేఖలను దిద్దాలి. అప్పుడు బొటనవేలితో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు.
3. విభూతిని ఎప్పుడు ధరించాలి?
విభూతిధారణ శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, నిత్య పూజ చేసే సమయం లో, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేటప్పుడు, హోమాలు చేసే సమయం లోనూ ధరించడం వల్ల అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. విభూతి కానీ తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించరాదు.
4. విభూతిని ధరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
విభూతి నేలపై పడకూడదు. ఒకవేళ పడితే, వస్త్రంతో తీయాలి కానీ, చీపురు తో ఊడ్చరాడు. పురుషులు విభూతిని స్త్రీల చేతికి ఇవ్వరాదు. పురుషులు, సుమంగళులైన స్త్రీలు విభూతిని తడిపి పెట్టుకోవాలి. పూర్వ సువాసినులు పొడి విభూతిని ధరించాలి. విభూతిని మధ్య వేలు లేదా ఉంగరము వేలుతో పెట్టుకోవాలి . చూపుడు వేలుతో పెట్టుకోరాదు.
5. విభూతి ఎన్ని రకాలు?
విభూతి ఐదు రకాలు
1. భస్మం – శ్వేత వర్ణము
2. విభూతి – కపిలవర్ణము,
3. భసితము -కృష్ణవర్ణము
4. క్షారము – ఆకాశవర్ణము
5. రక్షయని – రక్తవర్ణము
కాపాలికులు, అఘోరాలు ధరించేది చితాభస్మం. గృహస్థులు యోగులు ధరించేది హోమ భస్మం అనగా విభూతి.
6. విభూతి ధరించడం వల్ల కలిగే శుభాలు
విభూతి స్నానం సర్వ పుణ్యనదులలో చేసిన స్నానం తో సమానం.
వివిధ హోమభస్మాలు చేసే మేలు:
శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.
శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.
శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.
శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.
శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి
శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం,
శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.
శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.
హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.
7. శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన విభూతి యోగం..!
‘వి’ అనే ఉపసర్గకు వివిధమైన అనే అర్థం. ‘భూ’ అంటే ఉండటం. విభూతి అంటే పరమాత్మ తత్త్వం వివిధ రూపాల్లో ప్రకటితం కావడం. భగవద్గీత లోని పదవ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు పరమాత్మ తత్వమైన విభూతుల గురించి వివరిస్తాడు. ఆ అధ్యాయాన్ని విభూతి యోగం అంటారు. దండించేవారి దండనీతి,జయించేవారి రాజనీతి,రహస్యాలలో మౌనం,జ్ఞానులలో జ్ఞానం నేనే.సర్వభూతాలకు బీజకారణం నేనే. నేను కానిది ఏదీ లేదు.నా విభూతులు(రూపాలు) అనంతం. ఐశ్వర్యంతోను, కాంతితోను, ఉత్సాహంతోను కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశలని తెలుసుకో. ఇన్ని మాటలు దేనికి? నా తేజస్సులోని ఒకేఒక్క కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదని గ్రహించు. (10-41). అని చెబుతాడు
No comments:
Post a Comment