Translate

Saturday, September 17, 2022

గురుపూర్ణిమ- గురువు- వేదవ్యాసుడు(Guru and Guru Pournima- Veda Vyasa -Telugu Notes)

 గురువు-గురుపూర్ణిమ

 

 గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.




గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం.

 గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో  గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ  బిడ్డల కన్నా మిన్నగా  ప్రేమించే వారు.

గురువు అంటే  ఆధ్యాత్మిక  జ్ఞానాన్ని బోధించేవాడు.  హిందూ మతంలో గురువును  భగవంతునికి ,భక్తునికి మధ్య

అను సంధాన కర్తగా  భావిస్తుంటారు.

 

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్ఞాన గ్రాసకం  బ్రహ్మ గురురేవ న సంశయ: //

 ''గు అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే  చీకట్లను  అంటే అజ్ఞానాన్ని పారద్రోలేవారు.

 తమసోమాజ్యోతిర్గమయ ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ  అజ్ఞానం పోదు. అందుకు ఒక సూచన గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్దిచేత దానిని గ్రహిస్తాడు, తరిస్తాడు.

 గురువు అనగా  ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం.

 గురువు అంటే  తన సాధన ద్వారా  మానసికం గా  ఒక ఉన్నత స్థానాన్ని పొందినవాడు.

 ఉపాధ్యాయుడు/ టీచర్ అంటే లౌకిక విద్యలు బోధించేవారు. ఈ జన్మ కు సరిపడా  విద్యనిచ్చేది వీరైతే, జన్మ జన్మలకు సరిపడా జ్ఞానాన్ని అందించేవాడు, జన్మే లేకుండా చేసేవాడే అసలు గురువు. *తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జన్మరాహిత్యాన్ని ఇస్తాడు.

 గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.  ఆషాఢ  పౌర్ణమి  దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది.

 వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడని  ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.

 యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి.ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది.

ఆదిగురువైన పరమశివుడు తాండవం చేసే సమయంలో, ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని  ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశించాడు . శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

 

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి.

అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించ బడింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం  కాలేదు. గురువుల  ద్వారా  విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు).

 మొదట్లో వేదం ఒక రాశి గానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుష్షు ను(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరు గాంచారు. ఈయనే మొట్టమొదటి సారిగా వేదాన్ని  గ్రంధస్థం చేశారు.

  వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ | | వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 🙏🙏*

 శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు.

 వేదవ్యాసుడు, మత్స్యగంధి పరాశరమహర్షి కి జన్మించాడు. మత్స్యగంధి దాశరాజు పెంపుడు కుమార్తె. చేపల కంపు వల్ల ఆమెకు మత్స్య గంధి అనే  పేరు వచ్చింది. ఆమె అసలు  పేరు సత్యవతి.  పరాశర మహర్షి ఆమెను చేరి, దుర్గంధమును పోగొట్టి వ్యాస మహర్షి జన్మకు కారకుడవుతాడు. వేదవ్యాసుని అసలు నామము కృష్ణ  ద్వైపాయనుడు .

 వ్యాసుడు పుట్టిన వెంటనే పన్నెండేళ్ళ ప్రాయమునకు ఎదిగి తల్లికి నమస్కరించి, తనను స్మరించి నపుడు వచ్చి తల్లిని దర్శించు కుంటానని మాట ఇచ్చి వెళ్ళి పోతాడు. సత్యవతి తర్వాత కురువంశ మూల పురషుడైన శంతనుని వివాహం  చేసుకుంటుంది(ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. వివాహానికి పూర్వము భర్త కాని వ్యక్తితో సంతానాన్ని కని, మరల వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చునా  ) అంటే యుగాన్ని బట్టి యుగధర్మం మారుతుంది.

 మహర్షులు కొందరు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు కానీ, కొందరు కుటుంబ బంధనాలలో ఉండటానికి ఇష్టపడరు. వారు సదా పరమాత్మ ధ్యానంలో ఉంటూ విశ్వ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉంటారు. ఆ కోవ లోకే పరాశర మహర్షి వస్తారు.  అయితే విశ్వ శ్రేయస్సు కోసం వారి ద్వారా సంతానం రావలసి ఉన్నది. ఎంతో తేజస్సు కలిగిన వారి వీర్యాన్ని భరించటానికి కావలసిన సుక్షేత్రం, మత్స్యగంధిగా  తన దివ్య దృష్టి ద్వారా  తెలుసుకొని, ఆమె ద్వారా మాత్రమే కారణ జన్ముడు జన్మించగలడని, ఆవిడ కన్యత్వం చెడకుండా  పుత్రుని( వ్యాసుని) ప్రసాదించాడు.

 ఈయన వల్లే కురువంశం  అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై అంబాలికకు ధృతరాష్ట్రుని అంబిక కు, పాండు రాజుని, దాసికి విదురుని ప్రసాదించినాడు.

 అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే!భాగవతాన్ని రచించింది ఈయనే. కనుక  మనం ఏ పురాణం చదివిన వ్యాస వుచ్చిష్టమే.( వ్యాసుని ఎంగిలే. అంటే వ్యాసుని నోటి నుండి వెలువడినవే).

 వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని  ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందెదము గాక! వేదవ్యాసుడు మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన్ను మానవాళి కంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

 ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.  తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

  కనుక ఈరోజున హిందువులు గురువులను పూజించి, సత్కరించి తమ భక్తిని చాటుకుంటారు...

.

#ఆషాఢమాసం_పౌర్ణమి

#గురుపౌర్ణమి

 ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ, #వ్యాసపూర్ణిమ గా జరుపుకుంటాం. భారతీయ సమాజం వ్యాసమహర్షిని గురువుగా స్వీకరించింది. అంతకు ముందు ఎంతో మంది గురుశ్రేష్ఠులుండగా ఆయననే గురువుగా ఎందుకు స్వీకరించారనే అనుమానం కలగక మానదు. ఋక్కులు, యజస్సులను కలిపి యజుస్సంహితగా, సామాలన్ని కలిపి సామసంహితగా, అధర్వణ మంత్రాలన్ని కలిపి అధర్వ సంహితగా సంకలనం చేశారు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి అధ్యయనం సులభతరం చేసినవాడిగా వేదవ్యాసుడిగా కీర్తింపబడ్డాడు. సామాన్యులకు అర్థమయ్యేలా అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత, భాగవతాలను రచించిన వ్యాసుడిని గురువుగా స్వీకరించింది ఈ సమాజం.

 #వ్యాసపూర్ణిమ #గురుపూర్ణిమ

 వేదాలను, పంచమ వేదమైన మహాభారతాన్ని మనకందించిన వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పూర్ణిమగా చెప్పబడింది. వ్యాసుడు జగద్గురువు కనుక ఆయన జయంతిని గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం.

 

🍁🌺🍁 వేద వ్యాసుని జన్మ వృత్తాంతం 🍁🌺🍁

 కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్ముడికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహా తపస్సంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయమంతా బదరికాశ్రమంలో తపస్సులో ఉంటారు.

 భూలోకానికి పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము అనే అయిదు లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకము ఉంది. ఆ లోకములో తపస్వులు, సిద్ధులు ఉంటారు. వారు తమ ఇచ్ఛ మేరకు కింద లోకాలలో జన్మనెత్తడం, తిరిగి వెళ్లిపోవడం అనేది యుగ యుగాలుగా జరుగుతుంది. అటువంటి తపస్వులలో ఒకరైన అపాంతరముడనే మహర్షి ఒకరోజు బదరికాశ్రమానికి వచ్చాడు.

 ఆ మహర్షిని నర, నారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించిన మహర్షి వారితో ఇలా అన్నాడు. "నర, నారాయణులారా... మీకు గుర్తున్నదా, సహస్ర కవచుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు. వేయ్యేళ్లు తపస్సు చేసినవాడు, తనతో వేయ్యేళ్లు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలన్నాడు. అటువంటి వేయి కవచాలు అతను వరంగా పొందాడు. ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం, ఒకరు తపస్సు చొప్పున నిర్వహిస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను పోగొట్టారు. చివరిగా నరుడి వంతు వచ్చింది. మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసున్ని వధించటం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ రాక్షసుణ్ణి సూర్యుడు నేలమీదకు పంపబోతున్నాడు. వాడిని వధించాల్సిన బాధ్యత నర మహర్షీ నీదే."

 "అలాగే మహర్షీ. వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా" అని నరుడు బదులిచ్చాడు.

 "అంతే. కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలెత్తాలని బ్రహ్మ ఆదేశం. ఇప్పటికే ద్వాపర యుగం పూర్తి కావస్తున్నది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది. కృత యుగం నాటి జీవులు మీరు. ఇప్పుడున్నవారంతా అల్ప ప్రాణులు. మీ మహా దేహాలతో నేటివారిని నిర్జించటం చాలా సులువు, కానీ ధర్మం అందుకు అంగీకరించదు. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంస చాణూరులను, ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించటానికి నారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి. కర్ణ వధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి." అన్నాడు అపాంతరముడు.

 "సరే స్వామి" అన్నారు నర నారాయణులిద్దరూ.

 అక్కడినుండి అంతర్థానమైన అపాంతరముడు యమునా తీరంలో మత్స్యగంధికి సద్యో గర్భాన ఆషాఢ పూర్ణిమ రోజు ఉదయించాడు. సద్యోగర్భమంటే గర్భధారణ, నెలలు నిండటం, శిశువు పుట్టి పెరిగి పెద్దవాడవటం వంటి దశలన్నీ లేకుండా పోవటమే. పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజనగంధికి కృష్ణ ద్వైపాయనునిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు. తలచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు.

 హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేద వ్యాసుడయ్యాడు. శిష్యులకు వేదబోధ చేస్తూ అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా, ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు. కురు వంశాన్ని కాపాడటానికి దృతరాష్ట్ర, పాండురాజు మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు.

 మహా భారతంలో

 శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టి చేయటానికి సంకల్పించిన వెంటనే అతని నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటికి మేలు చేయటానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞానిని పుత్రునిగా పొందాడు. ఆయనే అపాంతరముడు. ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేసి క్రమబద్ధం చేసాడు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు అన్ని మన్వంతరాలలో మిక్కిలి ఆనందం పొందుతావని వరమిచ్చాడని మహాభారతంలో శాంతి పర్వం చెబుతుంది.......

No comments:

Post a Comment