కుండలినీ తంత్రం:-
సృష్టి ఆది కాలం నుంచి తాంత్రీకులు, యోగులు మానవుని భౌతిక శరీరం లో, సారగర్భితమైన అంతర్నిహిత
శక్తి, ఒకటి ఉంది అని భావన చేశారు. అదే కుండలినీ శక్తి. కుండలినీ నివాసం మేరుదండం
క్రింద మూలాధార చక్రము వద్ద గల చిన్న గ్రంథిలో ఉంది . ప్రాకృత శక్తుల వికాస
కారణంగా ఈ గ్రంథి ఓ బిందువు పై చేరింది. దీనిని విస్పోటనం ద్వారా చేదించవచ్చు.
కాలం సంస్కృతి సంప్రదాయాల అనుసరించి ఋషులు, యోగులు, సిద్దులు విభిన్న సాధనా పద్ధతుల ద్వారా ఈ శక్తిని మేల్కొలిపారు. కుండలినీ
యోగసాధన విధి తాంత్రిక గ్రంథాల్లో గుప్తంగా ఉంది.
గురువు నుంచి యోగ్యులైన శిష్యులకు ఈ రహస్య
విద్య ఒక తరం నుంచి మరో తరానికి అందించబడుతూ వచ్చింది. కుండలినీ సాధన ఆత్మగత
క్రమశిక్షణతో, తాంత్రిక క్రియా యోగముతోనూ
రూపొందించబడింది. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా ప్రాచీన యోగుల అన్వేషణలు
సరైనవే అని ప్రామాణికంగా నిరూపణ అయింది.
కుండలినీ జ్ఞానం :-
కుండలినీ మానవ దేహం లో వెన్నెముక అట్టడుగు
భాగమున నిద్రావస్థలో ఉన్న ఒక మహోన్నత గుప్త శక్తి. యోగులు దీనిని మూడున్నర చుట్టలు
చుట్టుకుని ఉన్న సర్పంగా దర్శించారు. వాస్తవానికి మూడున్నర చుట్టలుగా సర్పం మన
శరీరంలో లేకున్నా మానవ మస్తిష్కాన్ని విడిగా తీసి పరిశీలిస్తే, చుట్టలు చుట్టుకుని ఉన్న సర్పంగా ఉంటుంది. యోగుల అభిప్రాయం లో కుండలినీ మేరు
దండంలో ఉన్న అతీంద్రియ మార్గం. సుషుమ్నలో ఉన్న ప్రాణ ప్రవాహం. మూలాధారం వద్ద ఉన్న
ఈ గుప్త శక్తి పురుషులకు పెనీరియమ్ లోను, స్త్రీలకు సర్విక్స్ లోను
ఉంటుంది. "ఓం" కారములోని మూడు మాత్రలు ( అ, ఉ, మ) లానే సర్పంలోని మూడు చుట్టలు భూత భవిష్యత్ వర్తమానాలకు, తమో,
రజో, సత్త్వ గుణాలకు, జాగృత్, స్వప్న, సుషుప్తి లకు అర్థ
కుండలినీ పైన చెప్పిన ఏ తత్త్వానికి చెందని అతీత స్థితికి ప్రతీక.
ఇలా మూడున్నర చుట్టలుగా ఉన్న కుండలినీ
శక్తి విశ్వంలోని సమస్త అనుభవాలను సూచిస్తుంది. ఈ శక్తి జాగరణ వలన సంపూర్ణ శరీరంలో
కాయకల్ప ప్రక్రియ ప్రారంభం అవుతుంది. స్వరంలోను, శరీర వాసనలోను మార్పు వస్తుంది. హార్మోన్ల స్థానంలో పరివర్తన, మస్తిష్కం లోని కోశికల రుపాంతరణ వేగం అవుతుంది. సాధకుడు ఉన్నత ప్రాణశక్తి
నింపుకుని దివ్య దేహాన్ని పొందిన మహాత్ముని స్వరూపం అవుతాడు.
కుండలినీ తంత్ర :-
కుండలినీ యోగం తంత్ర - యోగముల అన్వేషణా
ఫలితం. జాగృతం అయిన కుండలినీ శక్తిని నియంత్రించ లేకపోతే వచ్చే పరిణామాన్ని తంత్ర
లో కాళీ గా చిత్రీకరించారు. కాళీ ధూమ్రవర్ణంతో నగ్నంగా 108 మానవ కఫాలములు గల మాల ధరించి, రక్తం ఓడుతున్న నాలుకను
చాపి ఓ చేతితో కత్తి, మరో చేత్తో నరికిన శిరస్సు ధరించి, విధ్వంసానికి సూచనగా దర్శనం ఇస్తుంది. సాధకుడు బ్రహ్మాండీయ శక్తిని, గతి శీలతకు ప్రతినిధి అయిన స్త్రీ రూపంలో ఉపాసన చేస్తాడు. ఆ శక్తి తత్త్వం
నుంచి క్రియాశీలమైన పురుషుడు, క్రింద పడుకున్న శివుని
స్థిరత్వముతో సాక్షీ మాత్రంగా ఉంటాడు. శివుని చాతిపై కాళిక నిలబడటం, శక్తి జాగరణ తో సాధకులు ఆత్మ పై సంపూర్ణ నియంత్రణ సాధించారు అనే దానికి సూచన.
ఆ మహోగ్ర శక్తి యొక్క ఉదృతి తనకు తానే
శాంతించాలి. వాస్తవానికి ప్రాణానికి రూపం లేనట్లే, కుండలినీ శక్తికి ఓ రూపం లేదు. అనంతమైన శక్తిని తమ అదుపులో ఉంచారని
చెప్పేందుకు పురాణాలు, విష్ణువు, శివుడు, కాళి మొదలైన దేవీ, దేవతల చెంత, సర్పాలను చిత్రీకరించారు. గురువు
నేతృత్వంలో కుండలినీ జాగృతి పొందిన శక్తికి ప్రతీక దుర్గా. సింహంపై కూర్చుని ఉన్న
ఈ అందమైన దేవీ రూపం ఎనిమిది భుజాలు, 52 శిరస్సులు గల మాల
ధరించి ఉంటుంది. 52 సంఖ్య నాదరూప బ్రహ్మను వ్యక్త పరిచే
సంస్కృత వర్ణమాలకు ప్రతీక. అంతేకాదు ఆమె ధీర ప్రశాంత రూపం, సాధనలోని ప్రతికూలతను తొలగించే శక్తిని శాంతిని ఇస్తుంది అని సూచన.
కుండలినీ జాగృతం -
కుండలినీ యోగం సిద్ది పొందాలి అంటే ఆత్మ
దర్శనం, కుండలినీ జాగృతి పొందిన గురువు సంరక్షణ లో, సాధకుడు సాధన చేయాలి.
మహాశక్తి సంపన్నమైన ఈ అతీంద్రియ శక్తి యొక్క వేగాన్ని తట్టుకోగల యోగ్యతను
సాధించాలి అంటే, గురువు అనేక గుప్త ప్రక్రియల ద్వారా
సాధకుని మనో శరీరాలను సిద్దం చేయాలి . లేకపోతే సాధకుని శరీరం హైవోల్టేజ్ కరెంట్
వచ్చిన కరెంట్ బల్బులా మారుతుంది.
శరీరాన్ని నీడ అనుసరించినట్లు , గురువు సమక్షంలో సాధకుడు
ఉండాలి. సాధకుడు దలియా, పలచని పప్పు, ఆవిరిపై ఉడికించిన పప్పు దినుసులు, పచ్చి కూరగాయలు వంటి
తేలికపాటి ఆహారం తగిన విధంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు, డ్రింక్స్, పాన్ పరాక్ లు, మొదలైన మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండాలి. శరీరం, మనసు పై నియంత్రణ వస్తున్న సమయంలో మందులు, ఓషధుల జోలికి పోకుండా
ఉండాలి. లేకపోతే సూక్ష్మ శరీరం లో తెరుచుకుంటున్న అతీంద్రియ మార్గాలు మూసుకొని
పోతాయి.
కుండలినీ జాగృతి ఉపాయాలు :-
కుండలినీ జాగృతి కోసం ఎంతో మంది సాధకులు, కొన్ని వందల సంవత్సరాల నుండి, అనేక విధాలుగా ప్రయత్నాలు
చేస్తుంటారు. ఈ సాధనకు కాల పరిమితి లేదు. కొంత మందికి కొన్ని సంవత్సరాల కాలం
పట్టవచ్చు. లేక 12 సంవత్సరాల కాలం పట్టవచ్చు...జన్మలు
కూడా కావచ్చు. గత జన్మలో సాధన చేసిన వారికి, కుండలినీ జాగృతి జన్మ
మూలంగా సిద్ధిస్తుంది. మంత్ర జపం వలన, గుప్త విద్య ద్వారా, తపస్సు ద్వారా, ప్రాణాయామం, క్రియా యోగం ద్వారా, హఠయోగ ద్వారా, వన మూలికలు, సోమలత, భస్మాల ప్రయోగం ద్వారా, గుప్తంగా ఉన్న తాంత్రిక ధీక్ష ద్వారా, గురువులు, మహాత్ములు ప్రసాదించే శక్తి పాతం ద్వారా ( శక్తిపాతం అనేది విద్య కాదు)
ఎటువంటి తీవ్రమైన సాధనల జోలికి పోకుండా పరమాత్మను ఆత్మ సమర్పణ చేయడం ద్వారా, సాధకులు కుండలినీ జాగృతి ప్రయత్నం చేస్తారు. కుండలినీ జాగృతి చాలా
ప్రమాదకరమైనది అని, ఏ చిన్న పొరపాటు జరిగినా సాధకుడు
పిచ్చి వాళ్ళు అవుతారు అనే ప్రచారం ఈంది లోకంలో. ప్రమాదం ఎక్కడ లేదు? జీవితం అంతా ప్రమాద భరితమే ! కాదా!? గర్భిణీ స్త్రీ , బిడ్డకు జన్మ ఇవ్వడం ప్రమాదం అని భావిస్తుందా!! ఉన్నత సాధనా మార్గమైన కుండలినీ
జాగృతి కోసం ప్రయత్నం చేయకుండా ఏ సాధకుడైనా ఉండగలడా!? కృష్ణుడు, బుద్దుడు, మహావీరుడు, వంటి మొదలైన అనేక మంది మహాత్ములు అంతా
కుండలినీ జాగృతి జరిగి జ్ఞాన నేత్రం తెరుచుకున్న మానవులే!
కుండలినీ మస్తిష్కం :-
మానవ మస్తిష్కంలో పది భాగాలు ఉన్నాయి.
వాటిలో 9 భాగాలు నిష్ర్కియావస్థలోను, పదో భాగం క్రియాశీలంగా
ఉంది. సహస్రారం పరమ చైతన్య శివస్థానం. దీనిని వేదం, తంత్ర హిరణ్య గర్భుడు అంటుంది. ఇది మెదడు లోని పిట్యూటరీ గ్రంథితో సంబంధం
కలిగి ఉంటుంది. ఈ పరమ చైతన్య కేంద్రానికి దిగువన, మనోశక్తి కేంద్రం అయిన మూడవ నేత్రం ఆజ్ఞా చక్రము లో ఉంది. దీని సంబంధం పీనియల్
గ్రంథితో ఉంది. ఈ అంతర్ జ్ఞాన క్షేత్రాలు రెండు, అతీంద్రియ మార్గమైన సుషుమ్నతో కలిసి ఉన్నాయి. కుండలినీ లోని ఊర్ద్వ శక్తి, సుషుమ్న ద్వారా స్థూల శరీరం తో కలిసిన, మెదడులోని నిద్రాణావస్థలో
ఉన్న, కేశికలు క్రయాశీలమై , సాధకునిలో కాయా కల్ప జరుగుతుంది.
కుండలినీ ఆరోహణ అవరోహణ :-
కుండలినీ జాగృతి అయి, మస్తిష్కంలో ఉన్న సహస్రార లోని శివునితో కలిస్తే, ఆ శక్తి మొత్తం మస్తిష్కాన్ని క్రియాశీలం చేస్తుంది. కుండలినీ యోగం దీనిని 6 భాగాలుగా గుర్తించింది. ప్రాచీన గ్రంథాలు, కుండలినీ జాగరణ మూలాధార
చక్రంలో జరుగుతుంది అని చెప్పడం వలన, అదే వాస్తవం అని ఎంతో
కాలంగా భావించారు. వాస్తవానికి కుండలినీ నివాస స్థానం సహస్రార చక్రములో. జాగరణ ఏ
చక్రం లో అయినా కుండలినీ జాగృతి జరగవచ్చు. కుండలినీ జాగృతి ఏ చక్రంలో జరిగినా, ఆ శక్తి ప్రభావం సహస్రార చక్రము చేరుతుంది. కానీ ఆ జాగరణ స్థాయి స్థిరంగా
ఉండదు. మస్తిష్కంలో జాగృత కేంద్రాలు అన్ని మళ్ళీ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతాయి.
కుండలినీ మూలాధారం చేరుతుంది. అందుకే ప్రాచీన గ్రంథాలు, కుండలినీ నివాసం మూలాధారం అని చెప్పబడింది.
కొంత మంది యోగులు మూలాధారం, స్వాధిష్ఠాన చక్రాలను పట్టించుకోరు. తంత్ర సాధకులు మణిపురానికి విశేష
ప్రాధాన్యం ఇస్తారు. సిద్ధుల కోసం ప్రయత్నం చేసే సాధకులు లక్ష్య సిద్ధి కావాల్సిన
చక్రాన్ని ఉపాసన చేస్తారు. స్వాధిష్ఠానం ఆనంద ప్రాప్తికి, మణిపూరక చక్రం ఆత్మవిశ్వాస వృద్ధి, అనాహతం విశ్వ ప్రేమ
వృద్ధి, విశుద్ధ చక్రము వివేకం, జ్ఞాన ప్రాప్తికి, ఆజ్ఞా చక్రము అంతర జ్ఞానం, అతీంద్రియ శక్తుల వృద్ధి
కోసం అనుష్టానం చేస్తారు. కుండలినీ జాగృతి ఆరోహణ క్రమం రెండు దశల్లో ఉంటుంది. అధో
కుండలినీ మూలాధారం నుంచి, సుషుమ్న ద్వారా ఆజ్ఞా చక్రము వరకు
చేరుతుంది. దీని వల్ల ఊర్ద్వ కుండలినీ ఈ చైతన్య శక్తిని బ్రహ్మ నాడి ద్వారా
సహస్రార చక్రానికి చేరుస్తుంది. దీని వల్ల సాధకునికి సుదూర ప్రాంతాల దర్శనం, దూర శ్రవణం, భూత భవిష్యత్ వర్తమాన కాలాల దర్శనం మొదలైన
శక్తులు లభిస్తాయి.
కుండలి నీజాగరణ ప్రక్రియ :-
కుండలినీ ద్వారా పొందే అనుభవాలు మనో శారీరక
ఘటనలు. దీని కేంద్రం మేరు దండం వద్ద ఉంది. దీనిలో ఉన్న ద్రవము ఉద్దీపన చెందితే, అది మేరు దండం ద్వారా పైకి చేరి, సాధకుని చైతన్య స్థితిలో
మార్పు తెస్తుంది. సాధకుడు ప్రథమ స్థాయిలో, ఇడ - పింగళ నాడులను
నియంత్రించడం, రెండో దశలో, చక్రములు జాగరణ చెందే ప్రక్రియలను సాధన చేయడం, అంతిమంగా సుషుమ్నా నాడి జాగరణను సాధించడం, దీని వలన కుండలినీ ఊర్థ్వ
గమన, ఆరోహణ సుగమం అవుతుంది.
సుషుమ్న తమోశక్తికి, వజ్రిణి రజోశక్తికి, చిత్రిణి సత్వశక్తికి ప్రతీకలు.
కుండలినీ లో ఉత్పన్నమైన మహోన్నత చైతన్యం, బ్రహ్మ నాడి ద్వారా
ప్రవహించి సహస్రారాన్ని చేరి శక్తి శివునితో సంయోగం పొందుతుంది. మస్తిష్కంలోని
నిష్క్రియ భాగాలు చైతన్యవంతమైన సాధకుడు సమాధి స్థితిని అనుభవిస్తాడు. జపాన్ లోని
హిరోషి మోటోయామా కుండలినీ జాగరణ వలన ఉత్పన్నం అయ్యే తరంగాలు, శక్తి ప్రవాహాన్ని గుర్తించి ఆ వివరాలను వివరించే యంత్రాన్ని కనిపెట్టడం
జరిగింది.
సమాధిలో అద్వైత అనుభవం :-
సమాధిలో ఉన్నతమైన అనుభవం తర్వాత శివ శక్తుల
కలయికలోని ఉదృతి తగ్గిన పిదప, సంపూర్ణ బ్రహ్మండ మూల
తత్త్వం అయిన బిందువు అవతరిస్తుంది. వారి కలయికతో ఏర్పడిన బిందువులోనే, మానవుడి బుద్ది, సృష్టి సంరచన నిండి ఉంది. మళ్ళీ
బిందువు రెండు భాగాలై శివ శక్తులుగా మారుతాయి. ఆరోహణ శక్తే ఊర్థ్వ గమనం చెందింది.
అవరోహణ జరిగినప్పుడు శివ శక్తులు భౌతిక స్థితిలో ఉంటాయి. వాటి అస్థిత్వం వేరుగా
ఉంటుంది.
ఆధ్యాత్మిక జాగరణ కేంద్రం సహస్రారం :-
వేదాలు, ఉపనిషత్తులు, గీత,
యోగ శాస్త్రాలు సహస్రారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాయి.
జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో "ఊర్ధ్వ మూల మథః శాఖ మశ్వథం
ప్రాహరవ్యయమ్" ద్వారా మహోన్నత సత్యాన్ని అందించారు. ఈ రహస్యాత్మక వృక్షం, వేళ్ళు, మొదలు పైన, కొమ్ములు, ఆకులు క్రింద ఉంటాయి. సాధకుని ఆలోచనలు, వ్యాకులత, సాంసారిక భావనలు మొదలైనవి కొమ్ములు, ఆకులు. మెదడు లోని భాగాలు వేళ్ళు, మొదలు మేరు దండం. సాధకుడు
ఊర్థ్వ ముఖ సాధన ద్వారా, సహస్రారాన్ని చేరి, వాసనలు సంస్కారాలు అనే వేళ్ళను సమూలంగా నాశనం చేస్తే, తన స్వస్వరూపమైన బ్రహ్మమును చేరుకోలడు. నిమ్న స్థాయి సాధనల ద్వారా, కోరికలు, ఆలోచనలు అనే కొమ్ములు ఆకులు తెంపుతున్నా
అవి మళ్ళీ చిగురిస్తూనే ఉంటాయి. ఈ అలౌకిక సత్యజ్ఞానం అన్ని ఆధ్యాత్మిక జాగరణలకు
కేంద్రం సహస్రారం అని తెలుపుతుంది.
కుండలినీ జాగరణ అనుభవాలు :-
కుండలినీ జాగృతి అనే విస్పోటం తర్వాత
సాధకుని జీవన గతి మారిపోతుంది. సామాన్య చైతన్యం నుంచి ఆధ్యాత్మిక మార్గంలోని
అనుభవాతీత, అత్యున్నత చైతన్యం లో ప్రవేశిస్తాడు. ఎలా
అర్థం చేసుకోవాలో తెలియని రకరకాల అనుభూతులు కలుగుతాయి. వెన్నెముక క్రింది భాగంలో
శక్తి విడుదలైనట్లు ఆ శక్తి కరెంట్ తీగ ద్వారా ప్రవహిస్తున్నట్లు గా మూలాధారం లో
వేడి పుట్టి, సుషుమ్న లో ఆ శక్తి పైకి క్రింద కు ప్రవహిస్తున్నట్లు
శక్తి ప్రవాహం వస్తూ పోతున్నట్టు, వెన్నెముక ట్యూబ్ లైట్ లా
వెలుగుతున్న అనుభవాలు, శరీరం లోపల అతి అద్భుతమైన ప్రకాశాలు
కనిపించడం ఇలా ఎన్నో అనుభవాలు జరుగుతాయి. మరి కొంత మంది లో మాత్రం అంత వరకూ అణిచి
పెట్టిన ఆలోచనలు, క్రోధం, కోరికలు విజృంభిస్తాయి.
కొంత మంది లో కామ కోరికలు ఎంతలా చెలరేగుతాయి అంటే మైథునం తప్ప మరో ధ్యాస ఉంఢదు. భయం ఎంతగా వేస్తుంది అంటే నిద్ర కూడా పట్టదు. ఒక్కో సారి తిండి పై ఎంత కోరిక పుడుతుంది అంటే ఎంత తిన్నా తృప్తి ఉండదు. మరి కొంత మందికి ఆకలి నశిస్తుంది. విపరీతమైన తల నొప్పి, నిద్ర పట్టక పోవడం, నిర్లిప్తత, నిరాశ ప్రపంచ పరిస్థితులపై విరక్తి ఉంటుంది. కొందరిలో అతీంద్రియ శక్తులు మేల్కొంటాయి. దేవ దూతలు, దివ్య ఆత్మల దర్శనం అవుతుంది. కొందరికి దివ్య సంగీతం, శరీరం తేలికగా తేలిపోతున్నట్టు, భూమి రెండుగా చీలినట్లు, వర్షంలో తడుస్తూ ఉన్నట్లు, ఉరుములు, మెరుపులు మొదలైన ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు అనుభూతులు కలుగుతాయి.
త్రివిధ జాగరణ :-
సాధకుడు నిరంతరం చేసేటటువంటి ఆసన, ముద్ర, ప్రాణాయామ యోగ క్రియల ద్వారా, కుండలినీ జాగృతికి ముందు, నాడీ జాగృతి ఆ తర్వాత చక్రాల జాగృతి జరుగుతుంది. అనేక అనుభవాలు కలుగుతాయి. అయితే వీటిలో ఆనందానుభూతి తప్ప తీవ్ర అనుభవాలు ఉండవు. సుషుమ్నా జాగరణ జరిగినప్పుడు కలిగే అనుభూతులు, కుండలినీ జాగృతి లోని అనుభవాల వలనే ఉంటాయి. సాధకులు దీనినే కుండలినీ జాగృతి అంటారు. అంతే కాక సాధకుని చిత్తం, చైతన్యం రెండూ వికాస ప్రక్రియలో ఉంటాయి. ఒక్కో సారి మేరు దండంలోని ద్రవ ఉద్దిపనల వలన ఇంద్రియ గతి విధులు ఆగిపోతాయి. చిత్తములో స్వతంత్ర అనుభవాలు ఒక్కో సారి కల్పనతో కూడిన అనుభవాలు కూడా కలుగుతాయి. మహ ప్రకాశాన్ని చూడటం మొత్తం భూమి కంపించడం, శరీరం దూది పింజంలా మారడం, ఇవన్నీ గౌణ మస్తిష్కం, మేరు ద్రవం యొక్క ప్రతిక్రియ స్వరూపాలు! వీటినే సాధకులు కుండలినీ జాగరణ గా భ్రమ పడుతుంటారు. ఈ అనుభవాలు కేవలం తాత్కాలికం.
వామమార్గ కుండలినీ జాగరణ :-
తంత్ర యోగులు త్రినేత్ర భేధనకు శల్య క్రియను
ప్రయోగించినట్లే కుండలినీ జాగృతి కోసం శివ శక్తుల ప్రతికలుగా సహయోగి - సహజోలి
మైథున క్రియ ద్వారా దీనిని సాధించే క్రియను చేపట్టారు. తాంత్రిక వామ మార్గంలో
ధనాత్మక ఋణాత్మక శక్తుల ప్రతినిధులు అయిన పురుషుడు, స్త్రీల మధ్య
జరుగు యవ్వన క్రియల ద్వారా కుండలినీ జాగృతి సాధ్యం అని వీరు భావిస్తారు. శివ
శక్తుల ప్రతీకగా ఈ స్త్రీ పురుష సంయోగం ఉంటుంది. తంత్ర మార్గ సంభోగం లో బిందు
స్కలనం జరుగరాదు ?
స్ఖలనాన్ని ఆపే దిశగా, పురుష సహయోగి
వజ్రోలి ముద్ర, మూల బంధ, ఉఢ్యాణ
బంధాల్లో దక్షిత సాధిస్తారు. స్త్రీ శరీరంలో, ఏకాగ్రత
బిందువు, గర్భాశయానికి వెనుక, మూలాధారం
వద్ద, విశిష్ట అనుభూతులతో ఉంది. తంత్రం లో దీన్ని జాగరణ
అంటారు. సంభోగ చరమ స్థాయిలో ఈ అనుభవం కొంత సమయం ఆపకుండా కొనసాగాలంటే బిందువు మీద
శక్తిని కేంద్రీకృతం చేయాలి. సాధారణంగా సంభోగ క్రియ వలన శక్తి విభిన్న భాగాలకు
పంచబడే కారణంగా శక్తి జాగరణ కాక సుఖ ప్రాప్తి ఉంటుంది. ఈ స్థితిని కాపాడుకోవాలి
అంటే స్త్రీ ఆ బిందువు పై మనసును కేంద్రీకరించే క్షమత కలిగి ఉండాలి. బిందువు పై
ఏకాగ్రతే సహజోలి క్రియ. ఇది చాలా కఠినం. సహజోలి సాధన ద్వారా యోని గర్భాశయాల
కండరాలు, సంకోచించే సాధన చాలా సమయం చేయాలి. కొంత కాలం బహిర్,
ఉడ్యాణ బంధ సాధన చేస్తే ఆ సమయంలో సహజంగా జలంధర, మూల బంధాలపై పట్టు సాధించి ఆమె సహజోలి ప్రక్రియ లో నైపుణ్యం సాధిస్తుంది.
స్త్రీ యొక్క సంకల్పం, శక్తి
కారణంగానే ఈ సంభోగం సంభవం అవుతుంది. ఎంతో సమయం పాటు జరిగే ఈ సంభోగం లో భోగంపై ఏ
కోరికా లేకుండా యోగ మార్గంలో సాగే పవిత్ర యజ్ఞ కార్యంగా అనుభవాన్ని ఆపితే శక్తి
ప్రవాహాం మారుతుంది. నాడీ వ్యవస్థ లోని రక్త ప్రసరణ ఊర్థ్వ ముఖంగా వెళ్ళడం
జరుగుతుంది. ఈ స్థితిలో స్త్రీ లోని చైతన్యం మారి ప్రకాశ దర్శనం అవుతుంది. పురుష
సంభోగ పరాకాష్ట సమయంలో శక్తి విస్ఫోటనం జరుగుతుంది. వామ మార్గ ఆధ్యాత్మిక అనుభవాలు
అన్నీ ఈ ఫలితం పైనే ఆధారపడి ఉంటాయి.
ఏ అదృశ్య శక్తి ఈ విశ్వమంతా వ్యాపించి బ్రహ్మాండంలోని
గ్రహాలను, అనంతకోటి నక్షత్ర మండలాన్ని నియమబద్ధంగా నడిపిస్తోంది?
జిజ్ఞాసువుల మస్తిష్కంలో మెదిలే ఈ ప్రశ్నకు వైదిక సాహిత్యంలో బదులు
ఇచ్చింది. 'నియతి అనే మహాశక్తి,నియంతగా
ఈ విశ్వాన్ని నడిపిస్తోంది ' ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల
క్రితమే మనకి వివరించారు.
సృష్టి లో నిర్జీవ పదార్థాలయిన పర్వతాలు, ఖనిజాలు,
లోహలు మొదలైన పదార్థాలకు భిన్నంగా చైతన్యం గల ప్రాణం మనలో ఎలా
ఏర్పడింది? ఈ సృష్టి అంతా పదార్థ జన్యమే కదా! ఆ జడ పదార్థం
నుంచి ప్రాణశక్తి ఉద్భవించే ఆస్కారం ఉందా? విశ్వబ్రహ్మండాన్ని
చైతన్యం చేసి నియమబద్ధంగా నడిపిస్తున్న, మహోన్నత శక్తికి
మూలం ఏది?
ఉచ్ఛ్వాస నిశ్వాసములు, హృదయ స్పందన,
రక్త ప్రసరణ, ఆకలి, మల
మూత్ర విసర్జన, జనన మరణాలు మొదలైన జీవన క్రియలు మనలో ఎవరు
నడిపిస్తున్నారు. ? మానవ మనుగడకు మూలం అయిన ఈ విశ్వ
రహస్యాలను, మన ప్రాచీనులు యోగ శాస్త్రం ద్వారా, అనేక గ్రంథాల్లో వివరించారు. వాటి సారాంశం ఏమిటంటే 'విశ్వాన్ని
నియమబద్ధంగా నడిపిస్తున్న అద్వితీయ శక్తే, మనలో నేనుగా,
జీవాత్మగా, ప్రాణంగా, మనసుగా
ప్రాణ కర్మలను నిర్వహిస్తోంది! విశ్వబ్రహ్మండం, మానవ పిండం
ఒకేరకమైన తత్త్వముతో ఏర్పడతాయి "
మానవ శరీరం పాంచభౌతికం, ప్రాణధర్మంతోనే
మానవ జన్మ సార్ధకం అయింది. ఈ ప్రాణం తప్పుకుంటే మృత్యువు మనల్ని కబళిస్తుంది,
అన్న భావనలో ఉంటాం. భౌతిక జీవనం కోసం చేసే పోరాటం,ప్రాణమయ జీవనం కోసం ఎందుకు చేయలేక పోతున్నామని, ఏనాడైనా
ఆలోచించారా? మనలోని ప్రాణాన్ని నిలకడ చేసుకోగలిగితే
అనారోగ్యం, లావెక్కడాలు, బరువు అవడాలు
ఉండవు.
యోగ సాధన ద్వారా మనలోని ప్రాణాన్ని సరి చేసుకొంటే
అన్నీ బాగుంటాయి. అన్నింటికీ మూలం ప్రాణమే. దేన్న చూసి అభివృద్ధి అని
మురిసిపోతున్నామో, అదే మన మూలాన్ని మరిచేలా చేస్తుంది.
దేహ భావనలో ఉన్నప్పుడు "ఒంట్లో బాగాలేదని"అంటాడు. ఇంగ్లీష్ చదువుల వాడు
"హెల్త్ బాగోలేదు" అంటారు, ఏ చదువులూ చదవక పోయినా
సనాతన సంప్రదాయి "ప్రాణం సరిగా లేదు" అంటారు. ప్రాణాన్ని సరిచేసుకుంటే ఏ
అనారోగ్యం మన దగ్గరకు దరిచేరదు అని మన ప్రాచీనులకు బాగా తెలుసు
No comments:
Post a Comment