Translate

Thursday, August 18, 2022

యోగ వాశిష్ట సారం (Yoga Vasishta Saaram)

యోగ వాశిష్ట  సారం
1. నాకు బంధం ఉంది, ముక్తి పొందాలి
అని తలచేవాడే ఈ వాశిష్ఠం చదవడానికి అధికారి.
జ్ఞానికిగాని, అజ్ఞానికిగాని అధికారం లేదు.

2. దేని నుండి ఈ సమస్తమూ పుట్టి, ఉండి, చివరికి అందులోనే లయం అయిపోతోందో ఆ పరబ్రహ్మకు నమస్కారము.

3.ఏ మహానంద సాగరం నుండి పుట్టిన విషయానందమనే బిందువులు సమస్త జీవులలో ప్రకాశించుచున్నదో, ఏది సమస్త జీవులకు జీవనమో,
ఆ బ్రహ్మానందస్వరూపుడైన పరబ్రహ్మకు నమస్కారము.

4. పక్షి ఆకాశంలో ఎగరడానికి రెండు రెక్కలూ అవసరమైనట్లు, ముక్తి పొందడానికి కర్మ-జ్ఞానములు రెండూ అవసరమే.

5. ఆత్మ సృజింపబడలేదు.
ఆత్మ దేనినీ సృజించలేదు.

6. జీవుడన్నది నామమాత్రమే.
ఉన్నది బ్రహ్మమే. 

7. భగవంతుడు సర్వశక్తిమంతుడు.
కనుక ఆయన ఆలోచనారూపములు మూర్తిమంతములగును. 

8.లెక్కింప సాధ్యముగాని ఈ నామరూపములన్నియు
సమస్తమూ చైతన్యమే.

9. జీవుడు, మనస్సు మొదలయినవి అన్నియు చైతన్యమునందలి స్పందనలే.

10. మనము కలవరపాటుకు అతీతులము.

11. మార్పులు లేనిదానిలో మార్పులు చూడడమే అజ్ఞానము.

12. కలలోని వస్తువులు ఘనంగా కనబడ్డా వాటిలో భౌతికత్వం లేనట్లు, ప్రపంచం భౌతికంగా కనబడ్డా నిజంగా ఇది శుద్ధచైతన్యమే.

13. నిజానికి ప్రపంచము, బ్రహ్మము, ఆత్మ అను పదముల అర్థములలో భేదమే లేదు.

14. సృష్టికర్తయగు బ్రహ్మ నుండి గడ్డిపోచ వఱకు
ఈ సమస్తమూ ఆత్మయే తప్ప వేరేదియు గాదు.

15.జల్లెడను ఎన్నటికీ నీటితో నింపజాలము.
వ్యక్తి ప్రాపంచిక వస్తువులను ఎంతగా సమకూర్చుకొన్నప్పటికి మనస్సు ఎప్పటికి కృతార్థము కాజాలదు.

16. శకమునకు క్షణమునకు మధ్య తాత్త్వికంగా ఎట్టి భేదము లేదు.

17. ఆసక్తి లేని వ్యక్తియే నిజమైన జీవన్ముక్తుడు.

18. స్రష్టలోని స్పందనమే సృష్టి.

19. వైరాగ్యం అనేది విసుగు వలన కలిగేది కాదు.
వివేకం వలన కలిగేది నిజమైన వైరాగ్యం.

20. ఈ ప్రపంచమొక క్రీడారంగము.

21. దారుణమైన ఈ సంసారసాగరమును దాటుటకై
మానవుడు శాశ్వతము, అవ్యయమునయిన దానిని ఆశ్రయింపవలెను.

22. అవిచ్ఛినమైన ఆత్మవిచారణ వల్లనే
ఆత్మసాక్షాత్కారం కలుగును.

23. ఆత్మవిచారము అంటే తనలోకి తాను సూటిగా చూడడమే.

24. మనస్సు అనంతమైన ఆత్మకంటె భిన్నమూ కాదు, 
దానికి స్వతంత్రమైన అస్తిత్వము లేదు.

25. ద్రష్టలోనిదే దృశ్యము.

26. స్రష్టకు భౌతిక దేహం లేదు.
సృష్టి కూడా భౌతికత్వము లేని 
భావనా స్వభావము కలదే.

27. స్రష్ట ఆత్మరూపుడు, అదేవిధముగా ఆయన సృష్టి కూడ నిజముగా తాత్త్వికముగా ఆత్మమయమే.

28. భావన మనస్సులో అంతర్గతముగా ఉండును.
దృశ్యవిషయము ద్రష్టలో అంతర్గతముగా ఉండును.

29. బాహ్యముగా సామాన్యజీవితమును గడుపుచు ప్రపంచమంతయు శూన్యమని అనుభవగోచరము గావించుకొన్న వ్యక్తి జీవన్ముక్తుడు. ఆయన జాగ్రదవస్థలో ఉన్నప్పటికీ గాఢనిద్రా ప్రశాంతిని అనుభవించును. కష్ట-సుఖములు కొంచెముగా గూడ అతనిపై తమ ప్రభావము చూపవు.

30. శిలలో చెక్కని ప్రతిమ సర్వదా ఉన్నట్లే
ప్రపంచము కూడా అఖండతత్త్వములో అంతర్గతముగా ఉన్నది.

31. ఏక కాలంలో సమత్వము-స్పందనము పరమాత్మయందున్నవి.

32. ఏదియు ఎప్పుడును సృజింపబడి యుండలేదు.

33. కారణము-కార్యము అనునవి కేవలము శబ్దములేగాని సత్యములు కావు.

34. సదా ఆత్మ విషయమై ఆసక్తితో ఉండుటయే అభ్యాసము.

35. చైతన్యము యొక్క స్వభావము వలన ఈ లోకములన్నియు మాటిమాటికి ఆవిర్భవించుచునే యుండును. మరియు తిరిగి తమ సంకల్పశక్తి వలన ప్రశాంతస్థితికి తిరిగి వచ్చును. ఇది బాలుని యాదృచ్ఛిక క్రీడ వంటిది.

36. నీ చైతన్యమే తపస్సుగా లేక దేవతగా అయి స్వతంత్రముగా ఫలమునిచ్చును.

37. ఒక్క అనంతచైతన్యము తప్ప ఏదియు ఎప్పుడు ఆవిర్భవించి ఉండలేదు. దీనిని దృఢముగా విశ్వసింపుము.

38. జ్ఞాని దేహము దృశ్యమైనదిగా కనిపించినప్పటికి, నిజముగా అది అదృశ్యము, ఆకాశమయము.

39. కంకణమునకు బంగారమునకు మధ్య 
తరంగములకు జలమునకు మధ్య 
విభాగము లేనట్లే 
ప్రపంచమునకు అనంతచైతన్యమునకు మధ్య భేదము లేదు.

40. ఈ నియతికి రెండు దశలున్నవి-
మానుషము,అతిమానుషము.

41. జ్ఞాని సంపర్కము వలన చుట్టూ ఉన్న గాలి, ధూళికణములు సైతం మోక్షమును పొందును.

42. ఆత్మ నూరుప్రయత్నములతో పొందదగినది.
అయినను అది పొందబడినను ఏదియు పొందబడినట్లు కాదు(అనగా అది ముందే ఉన్నది).

43.తండ్రి లేకుండా కొడుకు ఉండనట్లే
ద్రష్ట లేకుండా దృశ్యము లేదు.

44. దేవా! విశ్వసృష్టి నిశ్చితముగా నీకు ఉద్దేశరహితమైన వినోదము.

45. మనస్సే దేహమునకు బీజము.

46. ఇది అంతయు బ్రహ్మమే కనుక
జడము కూడ శుద్ధచైతన్యమే.

47. సమస్తము అవిభక్త స్థితిలోనున్నది.

48. వ్యక్తిగతమైన చైతన్యమే మనస్సు.
జ్ఞాని మనస్సు అఖండబ్రహ్మము.

49.ఆత్మలో విభాగము లేదు.
ఏలనగా ఇది అంతయు అఖండబ్రహ్మమే.

50. "ఒకడే" ఉన్నప్పుడు ఎవడు దేనిని ఎట్లు చేయును?

51. అపరిచ్ఛిన్నమగు ఆత్మలో స్రష్ట లేడు, సృష్టి లేదు, లోకములు లేవు, స్వర్గము లేదు, మానవులు లేరు, రాక్షసులు లేరు, దేహములు లేవు, భూతములు లేవు, కాలము లేదు, స్థితి లేదు, సంహారము లేదు.

52. ద్రష్ట-దర్శనం-దృశ్యం అను వాని మధ్య గల విభాగమును విసర్జించినప్పుడు పరబ్రహ్మ మొక్కటే ఉండును.

53. కుండ పగిలినప్పుడు దానిలోని ఆకాశం పగులదు.
వ్యక్తి మరణించినప్పుడు వానిలోని ఆత్మ నశించదు.

54. ప్రపంచ-బ్రహ్మముల మధ్య కార్య-కారణ సంబంధముండునని ఊహించుట వట్టి మూర్ఖత్వము. బ్రహ్మము మాత్రమే ఉన్నదనియు, ప్రపంచముగా కనుపించునది ఆ బ్రహ్మమే అనియు అన్నది సత్యము.

55. దృశ్యము జ్ఞానికి బ్రహ్మముగాను, అజ్ఞానికి ప్రపంచముగాను అగుపించును.

56. భోజనం భుజించు వ్యక్తిని పొందును.

57. ప్రపంచము పరమేశ్వరుని అనంతశక్తుల యొక్క ఆవిర్భావమే.

58. ఆత్మ ఒక్కటే సర్వకాలములయందుండును. ఆత్మయే ప్రపంచము, ఆత్మయే కాలము, పరిణామక్రమము కూడా.

59. ఏమియు లేనివానికి ఈ ఆత్మజ్ఞానమొక్కటి ఉన్నచో సమస్తము ఉన్నట్లే.

60. ఈ ఆత్మ మాత్రమే కోరదగినది, ఆరాధింపదగినది, ధ్యానింపదగినది.

61. ఆత్మకు వెలుపల ఏదియు లేదు.

62. రామా! నీవు చైతన్యసాగరరూపుడవు.
అందు రాముడను వ్యక్తి ఒక తరంగము.

63. అంతర్గతమయిన శుద్ధ చైతన్యము యొక్క 
ఎడతెగని ఎఱుకయే ఉత్తమ ధ్యానము, ఉత్తమపూజ.

64. ప్రతి జీవాణువునందును ఆత్మాచ్ఛాదన-ఆత్మజ్ఞానములను ఈ నాటకము ఎల్లప్పుడు అభినయింపబడుచుండును.

65. ఆ చైతన్యమే ప్రకృతిలో వస్తువులుగాను
వ్యక్తిలో ఇంద్రియములుగాను అగుపించును.

66. నీవు ఎట్టి సుఖ-దుఃఖములకు గురి అయినను సహింపుము. అవి వచ్చును, పోవును.

67. సృష్టిలో కనిపించు ఖండవిధానము మనస్సు యొక్క స్వీయచిత్రణమే.

68. శుద్ధాకాశములో చర్య(కర్మ) లేక చలనము లేదు.

69. 'చిత్' యొక్క చమత్కారమే ప్రపంచముగా భాసించుచున్నది.

70. వాస్తవముగా దేవతల దర్శనము స్వప్నము కంటె అభిన్నము.

71. ఆ చైతన్యము యొక్క ప్రధమభావనావిర్భావమే జీవుడు.

72. నేను క్రీడార్థము ప్రపంచమున సంచరింతును. ఏల అనగా, ఎవని నుండియు పొందవలసినది ఏదియు నాకు లేదు.

73. నిరర్థకమైన ఈ తపస్సులలోను, ఇతర క్రియలలోను నీవు నీ జీవితమును ఎందుకు వ్యర్థము చేయుచున్నావు?
 
మహాత్ముల సాంగత్యమునాశ్రయించుట వలనను నీవాత్మజ్ఞానమును పొందెదవు.

74. ఆచారముల వలన, శాస్త్ర విధుల వలన గాక జ్ఞానుల ఆరాధన వలన మాత్రమే వ్యక్తి జ్ఞానమును పొందును.

75. చిత్తపరిత్యాగమే సర్వపరిత్యాగము.

76. 'నేను' అను సంకల్పమే బంధమును కలిగించును.
'నేను లేను' అను సంకల్పమే మోక్షమును కలిగించును.

77. అనిబద్ధములో(నిబంధన రహితములో) ఉండుము.

78. బ్రహ్మమే ఈ సమస్తముగా ఇక్కడ అభివ్యక్తమయినది. దానికి వేఱుగా ఏదియు లేదు. అందువలన బంధ-మోక్ష భావనలను గూడ పరిత్యజింపుము. 
సహజకార్యనిమగ్నుడవయి శుద్ధమయిన నిరహంకారదశలోనుండుము.

79. నీ సందేహములన్నింటిని వదిలివేయుము.
ధార్మికధైర్యమునాశ్రయింపుము.
మహాకర్తగా, మహాభోక్తగా, మహాత్యాగిగా ఉండుము.

80. ఈశ్వరుడు ఈ ప్రపంచదృశ్యమునందు క్రీడించి పిదప దానిని తనలోనికి ఉపసంహరించును. సృజించి బంధమును కలిగించు శక్తియే సృష్టిని లయింపజేసి మోక్షమును కలిగించు శక్తిగా ఉండును.

81. అంతర్గతముగా సమస్తమును పరిత్యజింపుము. బాహ్యముగా యుక్త కార్యములో నిమగ్నుడవగుము.

82. నిర్మలమయిన అంతర్దృష్టియే జ్ఞానలక్షణం.

83. సగము మేల్కొన్న పసిబిడ్డవలె ఆత్మలో నెలకొని యుండుము.

84.ఉన్నది నశింపజాలదు.
లేనిది ఉండజాలదు.

85. నేను సమాధానము చెప్పజాలక మౌనం వహింపలేదు,
మౌనము మాత్రమే సమాధానము కనుక మౌనము వహించితిని.

86. వ్యక్తి సజీవుడుగా నున్నప్పటికి మృతని వలె ప్రవర్తించుదానిని సర్వోత్తమదశ అందురు.

87. విషయం 'విషయి' లోనిదే.
దృశ్యం 'ద్రష్టలోనిదే.

88. వందల కొలది ప్రతిబింబములున్నను అద్దము నిర్వికారముగా నుండునట్లు ఎన్నో లోకములు తనలో ఆవిర్భవించుచున్నను పరమాత్మ నిర్వికారముగా ప్రశాంతముగానుండును.

89. సహజమైన నీ అన్ని కర్మాలతోను, అనుభవములతోను, నీ జ్ఞానముతో గూడ పరమేశ్వరుడగు ఆత్మను ఆరాధింపుము.

90. సమాధిలో నెలకొన్న వ్యక్తి మానవరూపంలోనున్న బ్రహ్మమే.

91. ఈ విశ్వము, నీవు, నీ స్వప్నంలో జూచునదంతయు గూడ బ్రహ్మమే అనునదే సత్యము.

92. ప్రపంచము పరమాత్మ యొక్క స్వప్నము.

93. అపరిచ్ఛిన్న చైతన్యము ఎక్కడ ఏ రూపమున అగుపించవలెనని సంకల్పించుకొనునో అది ఆ విధముగా తన నిజస్వభావమును ఆ రూపములో తనకిష్టమయినంత కాలము అనుభవించును.

94. ఈ అపరిచ్ఛిన్న చైతన్యము ఎప్పుడును తన యధార్థస్థితిని విడువకుండా 'నేను జీవుడను' అని తలంచుట నిజముగా గొప్ప అద్భుతము.

95. మనస్సే సృష్టికర్తయగు బ్రహ్మ.

96. తత్త్వవేత్త వ్యవహార నిమగ్నుడయినను మౌనమునాశ్రయించి ఆకాశము వలె అసంగుడయి మూగవానివలెనుండును.

97. స్వప్నములలో నిర్దిష్టమైన క్రమముగానీ, వ్యవస్థగానీ, కార్యకారణ సంబంధముగానీ లేనట్లే, ఈ ప్రపంచదృశ్యములో గూడ నిర్దిష్టమయిన కార్యకారణ భావము లేక క్రమము ఉన్నట్లు అగుపించినను అట్టిదేదియులేదు.

98. ఆ పురుషుడు స్రష్ట అనియు, విశ్వము సృష్టింపబడినది అనియు భావించుట అసంగతము. ఒక దీపము మరియొక దీపముతో వెలిగింపబడినప్పుడు వాని మధ్య స్రష్ట-సృష్టి అను సంబంధము లేదు. అగ్ని ఏకమే.

99. ఈ భ్రాంతి ఏ కారణము వలన వచ్చినది? 
అను ప్రశ్న ఇక్కడ సముచితం కాదు. ఏల అనగా ఉన్నదానిని విచారించుట వలన లాభము కల్గునుగానీ లేనిదానిని విచారించుటవలన లాభము కలుగదు. భ్రాంతికి మూలమయిన లేని అజ్ఞానమును విచారించుట వ్యర్థమని సారాంశము.

100.ఆకాశము ఆకాశముగా ఆకాశములో నుండునట్లే
బ్రహ్మము బ్రహ్మముగా బ్రహ్మములో నుండును.

101. ఈ సృష్టి అనునది అవిభాజ్యమగు బ్రహ్మమే.

102. ధనార్జనకై వంటచెరకును సేకరించుటలో నిమగ్నుడయిన వానికి చింతామణి లభించినట్లు 
తమ అవసరములను నెరవేర్చుకొనుటకై గురువును, శాస్త్రములను ఆశ్రయింతురు. అయినను కాలక్రమమున గురు, శాస్త్రముల ఉపదేశములను అనుష్ఠించుటవలన వారు ఎక్కువ విలువగల ఒకానొక విషయమును(మోక్షమును) సాధింతురు.

103. బ్రహ్మము సర్వశక్తి సంపన్నము.

104. ఈ బ్రహ్మము యొక్క అభివ్యక్తికి హద్దు ఏదియు లేదు.

105. ఈ అఖండబ్రహ్మము సర్వశక్తిసంపన్నుడగుట వలన అపరిచ్ఛిన్న శక్తులు ఈ దృశ్యప్రపంచముగా అగుపించును.

106. ఉన్నదేదో అదే ఉన్నది.

107. సమస్తమూ నీ స్వాత్మయే.

108. ఆత్మనిష్ఠయే పరమ శ్రేయము.
ఆత్మనిష్ఠయే మోక్షము.....
.
.
.
.యోగా వశిష్ట నుండి యాదృచ్ఛిక కోట్స్
 

సరస్సు ఒడ్డున ఉన్న చెట్లు ప్రతిబింబించినట్లే
నీటిలో, అలాగే ఈ వైవిధ్యమైన వస్తువులన్నీ
మన స్పృహ యొక్క విస్తారమైన అద్దంలో ప్రతిబింబిస్తాయి.

బంధం నిజంగా ఉనికిలో లేనప్పటికీ, అది
ప్రాపంచిక ఆనందాల కోరిక ద్వారా బలంగా మారుతుంది;

ఈ కోరిక తగ్గినప్పుడు బంధం బలహీనమవుతుంది.
సముద్రం నుండి అలలు పైకి
లేచినట్లు అస్థిరమైన మనస్సు పరమాత్మ యొక్క విస్తారమైన మరియు స్థిరమైన విస్తీర్ణం నుండి పైకి లేస్తుంది.

ఈ ప్రపంచం, అవాస్తవమైనప్పటికీ, ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తుంది
మరియు ఒక బాలుడికి (ఉనికి లేని) దెయ్యం (భయానికి కారణం) వలె, అజ్ఞాన వ్యక్తికి జీవితకాల బాధలకు కారణం .

బంగారం అనే ఆలోచన లేనివాడు కంకణం మాత్రమే చూస్తాడు.
అది కేవలం బంగారం అనే ఆలోచన అతనికి అస్సలు లేదు.
అజ్ఞానికి లోకం దుఃఖంతో
నిండి ఉంటుంది, జ్ఞానవంతుడికి ఆనందంతో నిండి ఉంటుంది
అంధుడికి ప్రపంచం చీకటిగా ఉంటుంది
మరియు కళ్ళు ఉన్నవారికి ప్రకాశవంతంగా ఉంటుంది.
సంసారాన్ని తిరస్కరించిన మరియు అన్ని మానసిక భావనలను విస్మరించిన విచక్షణ కలిగిన వ్యక్తి యొక్క ఆనందం
నిరంతరం పెరుగుతుంది.

స్పష్టమైన ఆకాశంలో అకస్మాత్తుగా కనిపించే మేఘాల వలె
మరియు అకస్మాత్తుగా కరిగిపోయినట్లుగా, మొత్తం విశ్వం (కనిపిస్తుంది)
స్వీయ మరియు (దానిలో కరిగిపోతుంది).

బట్ట, పరిశోధించినప్పుడు,
దారం తప్ప మరేమీ కానట్లు కనిపించినట్లే, ఈ ప్రపంచం కూడా, విచారించినప్పుడు
, కేవలం నేనే.

నురుగు, కెరటాలు, మంచు మరియు బుడగలు నీటికి భిన్నమైనవి కావు, అలాగే ఆత్మ నుండి వచ్చిన ఈ ప్రపంచం ఆత్మ నుండి భిన్నంగా లేదు.
.
.
.

ఆటంక వాసనలు.....

శ్లో || లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహాను వర్తనం |
శాస్త్రాను వర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు ||

ప్రతి...

లోకానువర్తనం త్యక్త్వా=జనులు పోవురీతిని వదిలి; దేహాను వర్తనం త్యక్త్వా=దేహం నేననే భావాన్ని విడిచి; శాస్త్రాను వర్తనం త్యక్త్వా= శాస్త్రాలను అనుసరించటం వదిలి; స్వ అధ్యాస అపనయం కురు= నీ అధ్యాసను పోగొట్టుకో;

వ్యాఖ్య...

ఆత్మగా భావిస్తూ జీవించటంలో ముఖ్యమైన ఆటంకాలు.. 3, అనువర్తనం = గ్రుడ్డిగా సదా అనుసరించటం.

1) లోకానువర్తనం త్యక్త్వా...

జనులంతా ఎలా వెళ్తున్నారో చూచి గ్రుడ్డిగా అలాగే ఆధ్యాత్మికరంగంలో ఉన్న మనమూ వ్యవహరించటం కూడదు. సామాన్యంగా ఈ లోకంలో ప్రతివారూ తామున్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎగబ్రాకటానికి ప్రయత్నిస్తారు. ధన సంపాదన, వస్తు సంపాదన, పదవీ సంపాదన, భోగ సంపాదన, రాజ్య సంపాదన, ఐశ్వర్య సంపాదన, ఇలా అన్నింటిని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని దానికి తగిన కర్మలు చేస్తారు. వాటివల్ల ఆ జన్మలో కలిగే ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తారు. "ఆ తర్వాత ఏమిటి..? అని ఆలోచించరు. ఇదే లోకానువర్తనం". అలాగే భార్యాబిడ్దల పోషణ, బంధుమిత్రాదులతో సంబంధం - ఇవన్నీ బంధాలని భావించకుండానే బంధంలో పడిపోతుంటారు. ముక్తిని కోరే మనం గ్రుడ్డిగా లోకంలోని జనులను అనుసరిస్తే ఈ జన్మ వృధా అయినట్టే. జన్మరాహిత్యానికి ఏ ప్రయత్నమూ జరగనట్టే.

కనుక ఇలా గ్రుడ్డిగా అనుసరించటం కాకుండా జీవితాన్ని ఉన్నత ఆదర్శం వైపు త్రిప్పాలి. ఇప్పటిదాకా కొనసాగిస్తున్న జీవితాన్ని మార్చుకోవాలి. ఒక బాలుడు యవ్వనంలో ప్రవేశించగానే జీవిత విధానాన్ని మార్చుకుంటాడు. ఒక యువకుడు వృద్ధుడు కావటంతోనే జీవిత విధానం మారిపోతుంది. ఒక యువతి పెళ్ళి చేసుకోగానే పరిసరాలు మారిపోతాయి, జీవనవిధానం మారిపోతుంది. అలాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని వైపు ప్రయాణం సాగించాలంటే ఇందులో నిలదొక్కుకోవాలంటే ఇప్పటి వరకు సాధారణ జనుల మార్గంలో నడిచే నీవు నీ జీవన విధానాన్ని మార్చుకోవాలి.

తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఇళ్ళువాకిళ్ళను అందరి లాగా పట్టుకొని ప్రాకులాడరాదు. బరువులు, భాద్యతలు అంటూ అన్నీ నెత్తిన వేసుకొని, తనకు లేని, ఎప్పటికీ రాని సుఖాల కోసం పరుగులు తీస్తూ గ్రుడ్డిగా నీ తోటి వారిని అనుసరిస్తూ జీవించే విధానం పశుజీవనమే. అందుకే దీనిని వదలి తెలివిగా, మెలకువగా జీవించాలి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థితిలో ఉన్నవారిని ఆశ్రయించి వారు చూపిన మార్గంలో నీ జీవితాన్ని నడిపించాలి. అయ్యో నలుగురు నడిచే బాటను నడవాలి గదా..! అని దిగులు పడరాదు. లోకాన్ని చూచి భయపడరాదు. అందరూ బురదగుంటలో దిగుతున్నారు గదా..! అని మనమూ దిగరాదు.

2) దేహాను వర్తనం త్యక్త్వా...

దేహం మీద విపరీతమైన ప్రేమను పెంచుకొని ఎప్పుడూ దాని పోషణలోనే దాని అలంకరణలోనే మునిగిపోకూడదు. అది కోరే కోర్కెలను తీర్చే బానిసవు కావద్దు. ఇష్టమైన తిండికోసం, ఆకర్షణీయంగా కనపడటం కోసం, దేహానికి వెట్టిచాకిరీ చేయరాదు. అలాగని సాధకుడు దేహాన్ని పట్టించుకోకుండా ఉండరాదు. అది "సిద్ధుల పని". సాధకుడు ఈ దేహంతోనే సాధనలు సాగించాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసనలకు ఈ దేహమే ఆధారం కనుక తగినంత సాత్విక ఆహారాన్నిస్తూ తగినంత దేహపోషణ చేసుకుంటూ, అనారోగ్యం రాకుండా కాపాడుకుంటూ ఒకవేళ అనారోగ్యం చేస్తే ఔషధాలు వాడుతూ దానిని చక్కగా పోషించుకోవాల్సిందే. అయితే అతికూడదు.

3) శాస్త్రాను వర్తనం త్యక్త్వా...

శాస్త్రాలన్నీ కీకారణ్యాల వంటివి. వాటిపై విపరీత వ్యామోహాన్ని పెంచుకొని, అన్నీ తెలుసుకోవాలని తపనపడితే జీవితమంతా కృషి చేసినా చాలదు. చతుర్వేదాలు, షడంగాలు, షట్ శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, భగవద్గీత, చరిత్ర, భూగోళం, భూగర్భశాస్త్రం, వైద్యం, న్యాయశాస్త్రం.. ఎన్నో.. ఇవిగాక నాట్య నృత్య శిల్పం, సంగీతం, లలితకళలు, యోగా ఇలా ఎన్నో శాస్త్రాలను తెలుసుకోవాలని అనుకోరాదు. అన్నీ తెలుసుకోవటం సమయం వృధాచేసుకోవటమే. ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారు మోక్ష ప్రదాయక గ్రంధాలనే చదవాలి గాని పాండిత్య ప్రతిభకై ప్రాకులాడరాదు ఉత్తేజాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి గదా అని చెత్త నవలలు చదవరాదు. ఈ మూడింటిని లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, వాసనాత్రయం అంటారు. ఈ మూడింటిని వదలాలి. వదలి ఏంచేయాలి..

"స్వ - అధ్యాస - అపనయం - కురు"...

నీ అధ్యాసను తొలగించుకో. ఈ దేహమే నేననే భావనను తొలగించుకో...

1) కనుక మోక్షమార్గంలో నడిచే మహాత్ములను అనుసరించాలి. వారి బోధలను వినాలి. ఆచరించాలి. వారి ఆచరణను జాగ్రత్తగా పరిశీలించాలి.

2) అలాగే దేహాన్ని ఆరోగ్యాంగా ఉంచుకోవాలి.

3) అవసరమైనంత వరకు శాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి. వాటి లోతులను గ్రహించాలి. తెలివిగా వాటిని ఆచరించాలి.

ఇలా చేస్తూ గ్రుడ్డిగా అనుసరించటాన్ని వదలి వాసనలను అంతం చేయాలి. నిజంగా ఈ 3 వాసనలను అంతం చేయగలిగితే మిగిలిన వాసనలన్నీ రద్దై పోతాయి. ఎందుకంటే మిగిలిన వాసనలన్నీ దాదాపుగా ఈ మూడింటిలో ఏదో ఒక దానిపై ఆధారపడి ఉన్నాయి.

ఈ 3 వాసనలే ముక్తి మార్గంలో ప్రధాన ఆటంకాలు...

|| ఓం నమః శివాయ ||

1 comment: